రఘునాథపల్లి, వెలుగు: టైర్పేలడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. లింగాల ఘనపూర్ ఎస్సై శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ పట్టణానికి చెందిన బండి లక్ష్మి(60) కుటుంబసభ్యులతో కలిసి గురువారం బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు కారులో వెళ్లింది.
తిరిగి వస్తుండగా కుందారం శివారులో ఒక్కసారిగా కారు టైర్పేలడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి స్పాట్ లోనే చనిపోయింది. కారు నడుపుతున్న జెన్నె శ్రీకాంత్, అతని భార్య మాధవి, సోదరి శ్రావణి, తల్లి సిద్దేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను జనగామ హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైక్ ఢీకొని యువకుడు..
భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని యాదవ కాలనీకి చెందిన సురిమిల్ల నయన్ బుధవారం రాత్రి బైక్పై వెళ్తూ.. రెడ్డి కాలనీ మూల వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నయన్ తలకు తీవ్ర గాయమైంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడి అవయవాలను తండ్రి శ్రీనివాస్ దానం చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
