ESI కార్డుదారుల కాళ్లరుగుతున్నయ్!

ESI కార్డుదారుల కాళ్లరుగుతున్నయ్!

హైదరాబాద్, వెలుగు:  ఈఎస్ఐ కార్డుదారులకు రీ యింబర్స్​మెంట్​ రాకపోతుండగా ఏండ్లుగా ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కార్డుదారుడితో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అత్యవసర సమయంలో  దగ్గరలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు కట్టి ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత వారు రీయింబర్స్​మెంట్​ కింద  ఈఎస్ఐకి దరఖాస్తు చేసుకుంటుండగా,  మొత్తం ఖర్చులో  20 నుంచి 30 శాతం మాత్రమే వస్తుండగా, అది కూడా రెండు, మూడేండ్లు పడుతుంది.   ఇలా చాలామంది రీయింబర్స్ ​మెంట్ కోసం  ముషీరాబాద్​లోని హెడ్డాఫీసు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.  ఏండ్ల పాటు రాకపోతుండగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు కార్డుదారులు చెబుతున్నారు.  ప్రస్తుతం 6 వేల మంది రీ యింబర్స్​మెంట్ ​కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి దాదాపు రూ.15 కోట్ల వరకు రావాల్సి ఉంది.   సిటీ లో 53  ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, లక్షల మంది కార్డుదారులు ఉన్నారు.

రాష్ట్ర సర్కార్ ​పట్టించుకోవట్లే.. 
ఈఎస్ఐ హాస్పిటల్స్​ మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతాలు, మెడిసిన్స్​ కొనుగోలు తదితర వాటికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రతి 3 నెలలకోసారి నిధులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 6 నెలలకోసారి అరకొరగా 5 నుంచి 6 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ నిధులు డిస్పెన్సరీలు, హాస్పిటల్స్​ మెయింటెనెన్స్​కే సరిపోతున్నాయి. వీటిలోనే కొంత మొత్తాన్ని రీయింబర్స్​మెంట్​కింద ఇస్తున్నారు. నిధులు సరిపోకపోతుండగా ఎప్పుడు చూసినా ఐదారువేల అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటున్నాయి.   
 

నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుండగా..
​ఈఎస్ఐ కార్డుదారులకు ఏవైనా అనారోగ్య సమస్యలొస్తే ముందుగా స్థానికంగా ఉండే డిస్పెన్సరీలకు వెళ్లి మెడికల్ ఆఫీసర్​వద్ద చెక్​చేయించుకోవాలి. కార్డుదారులకు అవసరమైన ట్రీట్ మెంట్ అందుబాటులో లేకపోతే ఈఎస్ఐ హాస్పిటల్​కు రెఫర్​చేస్తారు. అక్కడ లేదంటే సనత్​నగర్​లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కు పంపిస్తారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్ మెంట్​సౌకర్యాలు లేకుంటేనే ప్రైవేట్​హాస్పిటల్స్​కు రెఫర్ చేస్తారు. ఇదంతా జరిగేలోపు పేషెంట్​హెల్త్ కండీషన్ మరింత సీరియస్ గా మారుతుంది. ఇలా పోలేక కొందరు నేరుగా ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్లి ట్రీట్ మెంట్​తీసుకుంటారు. అలాంటి వారు రీ యింబర్స్​మెంట్​ కు దరఖాస్తు చేసుకుంటే చెల్లించేందుకు ఈఎస్ఐ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన సత్తయ్య ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడు. 2019 మార్చిలో అతని కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైతే అత్యవసరంగా వెంటనే  ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్ మెంట్​చేయించిండు. రూ.39 వేల బిల్లు అయింది. ఈఎస్ఐ కార్డు ఉండగా రీయింబర్స్​మెంట్​కింద దరఖాస్తు చేసుకుంటే మూడేండ్లుగా పెండింగ్​లోనే ఉంది. కార్డు ఉన్నా ఏం లాభం లేదని, ఇంకా బిల్లు ఇస్తలేదని ఆఫీసు వచ్చిపోతున్నా అని అతను తెలిపిండు.

గౌలిదొడ్డికి చెందిన కుమార్ ప్రైవేట్​కంపెనీలో సెక్యూరిటీగా చేస్తుంటాడు. 2020 ఏడాదిలో అతని భార్యకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే స్థానికంగా ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చేర్పించాడు. ఆస్పత్రి బిల్లు రూ.30 వేల అయింది. అతనికి ఈఎస్ఐ కార్డు ఉండగా రీయింబర్స్​మెంట్​కు దరఖాస్తు చేసుకుండు. రెండేండ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఇంకా ఇవ్వడంలేదు. అప్పు చేసి బిల్లు కట్టినా. ఇలా సతాయిస్తుంటే ఎట్ల. అని బాధితుడు వాపోయిండు.
 

అందరికీ ఇస్తున్నం.. 
ఈఎస్ఐ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నం. కమిటీ అప్రూవల్ చేసిన ప్రతి అప్లికేషన్​కు బిల్లులు వెంటనే అందిస్తున్నం. గతేడాది మార్చి వరకు అందరికి రీ యింబర్స్​మెంట్ బిల్లులు అందాయి. మిగతా వారికి త్వరలో అందజేస్తం. 
                                                                                                                                               - నాగభూషణం, ఈఎస్ఐ రీయింబర్స్ మెంట్​ సెక్షన్ ఇన్ చార్జి, ముషీరాబాద్​