కార్లను అద్దెకు తీసుకుని పరార్

కార్లను అద్దెకు తీసుకుని పరార్
  • ఇద్దరు అరెస్ట్.. 16 కార్లు స్వాధీనం

మూసాపేట, వెలుగు:సెల్ఫ్ డ్రైవింగ్ సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకుని వాటిని మరో చోట అమ్ముతున్న ఇద్దరిని బాలానగర్ ఎస్​వోటీ, సనత్​నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బాలానగర్ డీసీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. గాజులరామారంలోని కైసర్ నగర్​కు చెందిన మహ్మద్ ఒమర్(28), బీకే గూడకు చెందిన నర్సగోని ప్రవీణ్ కుమార్ గౌడ్(39), అహ్మద్ అలీ ఈ ముగ్గురు గ్యాంగ్​గా ఏర్పడి సెల్ఫ్ డ్రైవింగ్ సంస్థల నుంచి కార్లను రెంట్​కు తీసుకునేవారు. మూడు నెలల పాటు వాటికి రెంట్​ను టైమ్​కు చెల్లించేవారు. 

కొన్నిరోజుల తర్వాత ఆ కార్లకు ఉన్న జీపీఎస్​ను తొలగించేవారు. కార్లను మరో చోట   తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని పారిపోయేవారు.కొంతకాలం తర్వాత ఫోన్ నంబర్, అడ్రెస్ మార్చి మళ్లీ ఇదే తరహా మోసాలకు పాల్పడేవారు. ముసాపిర్ సెల్ఫ్ కారు డ్రైవ్ సంస్థ, ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చిన కంప్లయింట్​తో  కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సనత్​నగర్ పోలీసులు ఈ గ్యాంగ్​పై నిఘా పెట్టారు. మహ్మద్ ఒమర్, ప్రవీణ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్​కు చెందిన మరో నిందితుడు అహ్మద్ అలీ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.  సనత్​నగర్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, వనస్థలిపురం, ఎస్​ఆర్ నగర్ ఏరియాల్లో నిందితులు తాకట్టు పెట్టిన 16 కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.