బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. ఎందుకంటే..?

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తోన్న సిట్ చీఫ్ సజ్జనార్‏ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు అధికారుల గౌరవాన్ని దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే అభియోగాలతో చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును సజ్జనార్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులకు నోటీసులు జారీ చేసి సిట్ విచారించింది. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‎కు సిట్ నోటీసులు ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలోనే సిట్ చీఫ్ సజ్జనార్‎పై ఆయన విరుచుకుపడ్డారు. సీపీ సజ్జనార్‌ ఖబడ్దార్‌.. నన్నే ఏమీ చేయలేకపోయావ్‌.. ఇంకా కేసీఆర్‌ను ఏం చేస్తావ్‌..? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ డీజీపీ కావాలని కలలు కంటున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

పింక్‌బుక్‌లో సజ్జనార్‌ పేరు నంబర్‌-1లో ఉంటుందని.. సజ్జనార్‌ రిటైర్ అయ్యి కర్ణాటక పోయినా, ఫుణె పోయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. దీంతో సీపీ సజ్జనార్‏ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.