- ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో గతంలో సస్పెన్షన్
- తాజాగా హనుమకొండలో రేప్ కేసు నమోదు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సై కదిరె శ్రీకాంత్ గౌడ్ వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. గతంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురి కాగా, తాజాగా ఆయనపై హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. 2025లో ఫేస్‌బుక్ ద్వారా ఓ మహిళతో ఎస్సై శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. చాటింగ్ చేస్తూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాడు.
మహిళ భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకున్న ఎస్సై, ఒక కేసు పనిమీద హన్మకొండకు వెళ్లిన సమయంలో ఆమెకు ఫోన్ చేసి లొకేషన్ పంపాలని కోరాడు. మహిళ లొకేషన్ పంపగానే ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హన్మకొండలోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కమిషనరేట్ పరిధిలో మరోసారి ఎస్సై శ్రీకాంత్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
మామూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్..
గతంలో తిమ్మాపూర్ ఎస్సైగా పనిచేసిన సమయంలో శ్రీకాంత్ గౌడ్‌పై ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై అప్పటి కరీంనగర్ సీపీకి ఫిర్యాదులు అందడంతో ఆయనను మొదట అటాచ్ చేసి అనంతరం సస్పెండ్ చేశారు. అయితే మూడు నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ నెల 2న ఆయన డ్యూటీలో చేరి సుమారు పది రోజులు పని చేసి, ఈ నెల 12 నుంచి సెలవులో ఉన్నట్లు సమాచారం. తాజాగా నమోదైన రేప్ కేసుతో ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌పై మళ్లీ శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. గతంలో కూడా ఒక వివాహితను వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.

