హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం ( ఫిబ్రవరి 8 ) జరిగిన ఈ ప్రమాదంలో కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ సహా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు ఫైల్ చేసిన FIR ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. శనివారం ఉదయం 10:08 గంటలకు కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాపర్టీ రూమ్‌లో మంటలు చెలరేగి దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది.
మంటలను గమనించిన క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు శ్రీనివాస్ రెడ్డి.ఈ క్రమంలో ఇతర సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు శ్రీనివాస్ రెడ్డి. ఉదయం 10:25 గంటలకు శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకోగా..అప్పటికే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో పొగను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది.
ఉదయం 10:30 గంటలకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకోగా.. భవనంలోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల వివరాలు ఫైర్ సిబ్బందికి అందజేశారు సిబ్బంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలు, పొగ పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్,ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
HRD హాల్, ఫర్నిచర్, పరికరాలు సహా ఇతర గదులకూ నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ ప్రమాదంలో భవనానికి కూడా నష్టం వాటిల్లిందని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
