ఎంపీ పప్పు యాదవ్‎పై కేసు.. రామమందిర విరాళాల నాటకంపై వారణాసిలో ఫిర్యాదు

ఎంపీ పప్పు యాదవ్‎పై కేసు.. రామమందిర విరాళాల నాటకంపై వారణాసిలో ఫిర్యాదు

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు చేపట్టిన వీధి నాటకం రాజకీయ దుమారానికి దారితీసింది. రామమందిర విరాళాల సేకరణలో అవినీతి జరిగిందంటూ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (రాజేశ్ రంజన్) పూజారి వేషధారణలో చేసిన నిరసనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై జహంగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య మైథిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

పప్పు యాదవ్ నిరసన సమయంలో మతపరమైన చిహ్నాలు, కాషాయ వస్త్రాలను అవమానించారని, శ్రీరామ్​లల్లా విరాజమాన్ చిత్రాన్ని కాళ్ల కింద ఉంచడం సనాతనుల మనోభావాలను గాయపరిచిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. శుక్రవారం పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు 'చందా చోర్, గద్దీ చోడ్' అంటూ వినూత్న నిరసన చేపట్టారు. ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి పూజారిలా నటించగా, ఇతర ఎంపీలు భక్తులుగా మారి డబ్బిచ్చారు.

ఆ డబ్బును విరాళాల పెట్టెలో కాకుండా పప్పు యాదవ్ తన జేబులో వేసుకునేలా ప్రదర్శన చేశారు. విరాళాల దుర్వినియోగంపై చర్చ జరగాలనే ఈ నిరసన చేపట్టామని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. మరోవైపు, పార్లమెంటులో ఈ తరహా నాటకీయ ప్రదర్శనలను అనుమతించబోమని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సచివాలయం స్పష్టం చేసింది. ఈ ఘటనపై లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.