సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై కేసు నమోదు

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై కేసు నమోదు

కుత్బుల్లాపూర్: సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి‎పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. ఈ మేరకు మృతుడి భార్య వసంత దుండిగల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని.. ఆయనది సహజ మరణం కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వసంత ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని కలికిరి పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం కలికిరి ఠాణాకు బదిలీ చేసినట్లు సమాచారం. 

2026, మే 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేందర్ మృతి చెందినట్లు అక్కడి పోలీసులు మృతుడి భార్యకు సమాచారం అందించారు. అనంతరం రాజేందర్ మృతదేహాన్ని కలికిరి నుంచి హైదరాబాద్‎కు తరలించారు. 

అయితే, రాజేందర్ మృతదేహాన్ని పరిశీలించిన భార్య వసంత, కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఇది సాధారణ మరణం అంటున్నారు. ఈ క్రమంలోనే రాజేందర్ భార్య వసంత దుండిగల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు.