మూడు నెలల్లో కులగణన పూర్తి చేయాలి

మూడు నెలల్లో కులగణన పూర్తి చేయాలి
  • ఆ తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి
  • గణన చారిత్రాత్మక నిర్ణయం.. పకడ్బందీగా చేపట్టండి
  • లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా న్యాయనిపుణులను నియమించండి
  • బీసీ కమిషన్​ను కోరిన పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులు
  • కులగణనపై పలు సలహాలు, సూచనలు అందజేత

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణను మూడు నెలల్లో పూర్తి చేయాలని పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులు కోరారు. సోమవారం ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ ఆఫీసులో చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు శుభప్రద పటేల్, ఉపేందర్, కిషోర్ గౌడ్, మెంబర్ సెక్రటరీ బాలమాయదేవితో ప్రతినిధులు సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో కులగణన ఎలా చేపట్టాలన్న అంశంపై బీసీ కమిషన్​కు పలు సలహాలు, సూచనలు వినతిపత్రం రూపంలో అందజేశారు.

సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కులగణన ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా చేపట్టాలని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ సర్వేను పూర్తి చేశాయని వాటిని స్టడీ చేయాలన్నారు. బిహార్ కులగణనలో ఆదిలాబాద్ కు చెందిన రాజేందర్ అక్కడి జీఏడీ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారిగా ఉండి ఈ గణనలో కీలక పాత్ర పోషించారని ఆయన సలహాలు, సూచనలు తీసుకోవాలని చంద్రకుమార్ తెలిపారు.

కులగణన చేపట్టే సమయంలో ఈ ప్రాసెస్ ను అడ్డుకోవటానికి  పలువురు కోర్టుకు వెళ్తారని, వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు నిపుణులైన లీగల్ టీమ్ ను ప్రభుత్వం నియమించాలని సూచించారు. ఈ లెక్కలు బయటకు రాకుండా కూడా కొన్ని శక్తులు అడ్డుపడతాయన్నారు. క్వశ్చనీర్ లో క్యాస్ట్ దగ్గర సబ్ క్యాస్ట్ ప్రశ్నను కూడా చేర్చాలన్నారు. జాయింట్ ఫ్యామిలీ వివరాలు, వ్యక్తిగత వివరాలు తీసుకోవాలని భూమి, వ్యాపారాలు, కౌలు రైతులు, సొంతగా భూమి సాగు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని క్వశ్చనీర్ ను ఖరారు చేయాలని చంద్రకుమార్ బీసీ కమిషన్ ను కోరారు.

తప్పుడు ప్రచారాలు బాధాకరం

రాష్ట్రంలో గ్రామపంచాయతీల టర్మ్ ముగిసి నాలుగు నెలలు పూర్తయిందని, ఈ నేపథ్యంలో కుల గణన చేపట్టిన తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రొఫెసర్ మురళీమనోహర్ కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కులగణన చేయకుండా హైకోర్టు ముందు ఈ ఒక్కసారి ఎన్నికలకు అవకాశం ఇస్తే వచ్చే సారి కులగణన చేపడుతామని అబద్ధాలు చెప్పటంతో హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

రాజకీయ పదవులతో పాటు విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచాలని సూచించారు. కులగణన అడ్డుకోవటానికి కొంత మంది లోకల్ బాడీ ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నారని, ఇది బాధాకరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో కులగణన చేసే సమయంలో ఉన్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి  బీసీ కమిషన్ తీసుకెళ్లాలన్నారు. ఈ సర్వేలో మహిళల అంశాలు ఉండాలి, పిల్లలు, వితంతువులు, ఆస్తుల వివరాలు అన్ని తీసుకోవాలని ప్రొఫెసర్ పద్మజ షా కోరారు.

గ్రామాల్లో లక్షల మంది వితంతువులు పిల్లల చదువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి వివరాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, తిరుమలి, పృథ్విరాజ్, దేవళ్ల సమ్మయ్య , సతీశ్​తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్త: కృష్ణమోహన్

కులగణన అంశంపై ఆస్కీ, సీజీజీ తో పాటు పలు సంస్థల ప్రతినిధులను కలిశామని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. బిహార్ కుల గణనలో 17 ప్రశ్నలు అడిగారని, ఇక్కడ ప్రశ్నలు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. వ్యక్తిగత వివరాలు చాలా తక్కువ తీసుకోవాలని వినతులు వస్తున్నాయని ఆయన తెలిపారు. కులగణనలో ఏ ప్రశ్నలు ఉండాలి అని సలహాలు సూచనలు కమిటీ ప్రతినిధులు ఇచ్చారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.