న్యూఢిల్లీ: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే సీబీఐకి చెందిన స్పెషల్ టీమ్ కరూర్‌లోని వేలుసామిపురంలో పర్యటించిందని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నిబంధనల ప్రకారం, సీబీఐ ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌ను తిరిగి నమోదు చేసిందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో టీవీకే పార్టీనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో సీనియర్ ఆఫీసర్‌ను విచారణాధికారిగా నియమించడంతో పాటు అసిస్టెంట్ అధికారులనూ అపాయింట్ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు, సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాగా, సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో 41 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు.
