వామనరావు దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం

వామనరావు దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం
  • వామనరావు దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం 
  •     మొదటి రోజు సీన్ రీకన్​స్ట్రక్షన్ తరహా ఎంక్వైరీ 
  •     మంథని కోర్టు పరిసరాలు, ఘటనాస్థలం పరిశీలన

పెద్దపల్లి, వెలుగు: అడ్వకేట్లు వామనరావు, నాగమణి దంపతుల మర్డర్​ కేసులో సీబీఐ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. హత్య జరిగిన రోజు ఘటనల క్రమంలోనే సీబీఐ  బృందం విచారణ కొనసాగింది. వామనరావు దంపతులు హత్యకు గురైన రోజు ఉదయం తమ సొంత గ్రామం గుంజపడుగు నుంచి మంథని కోర్టుకు వచ్చారు. కేసు వాదనల తర్వాత హైదరాబాద్​కు బయలుదేరారు. వారు రామగిరి మండలం సెంటనరీ కాలనీకి రాగానే రోడ్డుపై నరికి చంపారు. సీబీఐ బృందం కూడా సీన్ రీ కన్​స్ట్రక్షన్ తరహాలో దర్యాప్తు చేసింది. మొదట వారి స్వగ్రామం గుంజపడుగుకు వెళ్లి వామనరావు తండ్రి కిషన్​రావు, సోదరుడు చంద్రశేఖర్ ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత కిషన్​రావుతో కలిసి మంథని కోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి రామగిరి మండలం సెంటనరీ కాలనీకి చేరుకుని హత్యా స్థలాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రామగుండం కమిషనరేట్ అధికారులు సీబీఐకి అందజేశారు. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో ఇక్కడి నుంచే విచారణ కొనసాగిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. ఇందుకోసం రామగుండం కమిషనరేట్​లో సీబీఐకి ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.

దర్యాప్తు ఇలా..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు లాయర్లు వామనరావు, నాగమణి 2021ఫిబ్రవరి 17న ఓ కేసు విషయమైన మంథని కోర్టుకు వచ్చి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో కొందరు వ్యక్తులు లాయర్ దంపతులను జనం చూస్తుండగానే నడిరోడ్డుపై నరికి చంపారు. నాగమణి అక్కడికక్కడే చనిపోగా, వామనరావు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ వామనరావు తండ్రి కిషన్​రావు మాత్రం కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టీస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్​ ఎన్ కే సింగ్ ధర్మాసనం పిటిషన్​ను విచారించి వామనరావు దంపతుల హత్య కేసును ఆగస్టు 12న సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నింధితులుగా ఉన్న ఏడుగురు ఇప్పటికే అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు.