కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి : మేచినేని కిషన్​రావు

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి : మేచినేని కిషన్​రావు

హైదరాబాద్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి మేచినేని కిషన్​రావు డిమాండ్ ​చేశారు. సోమవా హైదరాబాద్​లో నిర్వహించిన తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్​నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణకు గోదావరి నీళ్లు ఇవ్వాలంటూ 1999లో తాను ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​వరకు పాదయాత్ర చేసినట్టు చెప్పారు. అప్పట్లో ప్రముఖ ఇంజనీర్లు హన్మంతరావు, శ్రీనివాస్​రావు సహా 12 మంది రిటైర్డ్​సీఈలతో గోదావరి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించామన్నారు. 

అయితే గోదావరిపై చిన్న ఆనకట్టలు తప్ప పెద్ద ప్రాజెక్టులు కట్టొద్దని వాళ్లు సూచించారన్నారు. భారీ ప్రాజెక్టులు కడితే ఐదు, పదేండ్ల కంటే మించి ఉండవని, వరదలకు కొట్టుకుపోవడం ఖాయమని వారు హెచ్చరించినట్టు చెప్పారు. గోదావరిపై ఇచ్చంపల్లి, కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద చిన్న ఆనకట్టలు కట్టి అక్కడి నుంచి నీటిని రాష్ట్రంలో ఎత్తయిన ప్రాంతాలైన శామీర్​పేట్, స్టేషన్​ఘన్​పూర్, నర్సంపేటకు ఎత్తిపోయాలని వాళ్లు సూచించారన్నారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్ కు చెప్పానని, రిటైర్డ్​సీఈ ధర్మారెడ్డితో కూడా చెప్పించానన్నారు. కానీ కమీషన్ల కోసమే కేసీఆర్​కాళేశ్వరం కట్టారన్నారు. 

ఉద్యమకారులను ఆదుకోవాలి

1969 ఉద్యమకారులు దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ప్రభుత్వం వారిని గుర్తించి ఆదుకోవాలని మలిదశ ఉద్యమకారుడు మేచినేని శ్రీనివాస రావు అన్నారు. 1969 ఉద్యమకారుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని పార్టీలను కోరుతామన్నారు. సుదర్శన్​రావు, రవీందర్​రెడ్డి, హరిత్, జయ వింద్యాల, సాజిదా సికందర్, సుభద్రారెడ్డి పాల్గొన్నారు.

పవన్​ ఇక్కడెలా పోటీ చేస్తరు?

తెలంగాణ ఏర్పడినప్పుడు అన్నం ముట్టలేదని చెప్పిన పవన్​కల్యాణ్ ఇక్కడి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని కిషన్​రావు ప్రశ్నించారు. ఇక్కడ  స్థిరపడిన వారంతా తెలంగాణ బిడ్డలేనని, సెటిలర్స్​ పేరుతో ఓట్లు అడిగే కుట్ర చేస్తున్న పవన్​కల్యాణ్ ​పార్టీని  ప్రజలు తిరస్కరించాలన్నారు.