2026-27 విద్యా సంవత్సరంలో CBSE (సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రవేశపెట్టబోతున్న కొత్త భాషా విధానంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజ్లు నేర్చుకున్న విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న.. ఈ సవరించిన విధానం ప్రకారం.. క్లాస్ IX (తొమ్మిదో తరగతి), క్లాస్ X (పదవ తరగతి) చదవబోతున్న విద్యార్థులు మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. వాటిలో కనీసం రెండు భారతీయ మాతృభాషలై ఉండాలి.
విదేశీ భాషలను ఐచ్ఛికంగా నాలుగో సబ్జెక్టుగా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఆకస్మిక మార్పు విద్యార్థుల దీర్ఘకాలిక విద్యా, వృత్తి ప్రణాళికలను దెబ్బతీస్తుందని చాలా మంది తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి ఈ మార్పు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో CBSC సిలబస్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి.. జర్మనీలో ఇంజనీరింగ్ చదివి, ఆ దేశంలోని ప్రఖ్యాత ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆశతో గత మూడేళ్లుగా జర్మన్ భాషను నేర్చుకున్నాడు.
"జర్మన్ విశ్వవిద్యాలయంలో చదువుకుని, అక్కడి అగ్రశ్రేణి ఆటోమొబైల్ కంపెనీలలో ఒకదానిలో పనిచేయాలన్నది అతని కల. అందుకే అతను ఆరో తరగతి నుంచే జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు," అని ఆ విద్యార్థి తండ్రి ఒక జాతీయ మీడియా సంస్థతో చెప్పుకొచ్చాడు. "ఇప్పుడు తొమ్మిదో తరగతిలో అతను మొదటి నుంచి సంస్కృతం నేర్చుకోవాల్సి రావచ్చని చెబుతున్నారు. ఇది అన్యాయంగా, ఆటంకంగా అనిపిస్తోంది."
►ALSO READ | ఏడాది లోగా మోదీ ప్రభుత్వం కూలిపోతుంది.. హాట్ టాపిక్గా రాహుల్ ప్రకటన
సమస్య బహుభాషా విధానం కాదని.. దానిని అమలు చేసే సమయమే అసలు సమస్య అని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే విదేశీ భాషలను నేర్చుకోవడానికి సంవత్సరాలు వెచ్చించారని, పరీక్షలను పూర్తి చేశారని.. వాటి ఆధారంగా తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ కొత్త విధానం వల్ల.. విదేశీ భాషలను పూర్తిగా వదిలేయాల్సి రావచ్చని ఆందోళన చెందుతున్నారు.
అసలేంటీ త్రిభాషా విధానం:
దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది. ఎన్ఈపీ 2020, ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈ 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా 2026–27 విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల (ఆర్1, ఆర్2, ఆర్3) బోధనను తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నూతన విధానం 2026 జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. విద్యార్థులు ఎంచుకునే మూడు భాషల్లో కనీసం రెండు కచ్చితంగా స్వదేశీ భాషలై ఉండాలి. ఒక విదేశీ భాషను ఎంచుకోవాలంటే మిగిలిన రెండూ భారతీయ భాషలే అయి ఉండాలి. లేదంటే దానిని కేవలం అదనంగా నాలుగో భాషగా మాత్రమే చదువుకోవాలి. అలాగే కొత్త విధానంతో తలెత్తే టీచర్ల కొరతను అధిగమించడానికి రిటైర్డ్ టీచర్ల నియామకం, హైబ్రిడ్ బోధన, స్కూళ్ల మధ్య రిసోర్స్ షేరింగ్‌కు బోర్డు అనుమతించింది.
