చందానగర్ బంగారం షోరూంలో.. కాల్పులు జరిపింది వీళ్లే..

చందానగర్ బంగారం షోరూంలో.. కాల్పులు జరిపింది వీళ్లే..

హైదరాబాద్ లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో  కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బంగారం షాపులో చోరీకి యత్నించిన దొంగలు  సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయారు.  అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. ముగ్గురు దొంగలు జ్యువెలర్స్ షాపు నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో  కనిపిస్తున్నాయి. ఇందులో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా..మరో ఇద్దరు క్యాప్ ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకుని చేతిలో తుపాకులు పట్టుకుని ఉన్నారు. ముగ్గురు షాపు నుంచి బయటకు వెళ్లాక అక్కడి నుంచి ఒకే బైక్ పై పారిపోయారు. ముగ్గురు బైక్ పై జహీరాబాద్ వైపు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 

ఆగస్టు 12న ఉదయం 10: 45కి చందానగర్ లోని ఖజానా జ్యువెల్లరీ దుకాణంలోకి కొందరు  దొంగలు చొరబడి చోరీ చేసేందుకు యత్నించారు. ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. వారు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ముందుగా తమ వెంట ఉన్న పిస్టల్ తో  సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దుండగులు జరిపిన కాల్పు ల్లో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలయ్యాయి. తొలుత సిబ్బందిని తుపాకీతో బెదిరించిన దుండగులు లాకర్ కీ అడిగారు. సిబ్బంది అందుకు ఒప్పుకోక పోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగులగొట్టారు. దుకాణ సిబ్బంది పోలీసులకు కాల్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా వారిని చూసిన దుండగులు పారిపోయారు. నిందితుల కోసం పది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

జిల్లా సరిహద్దులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దొంగలు రాష్ట్రానికి చెందిన వాళ్లా లేక అంతరాష్ట్ర ముఠానా అనే విషయాన్ని తేల్చేందుకు.. షోరూంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

పట్టపగలు.. ఉదయం 11 గంటల సమయంలో రద్దీగా ఉండే ఏరియాలోని బంగారం షోరూంను.. దోపిడీ దొంగలు టార్గెట్ చేసి మరీ ఎటాక్ చేయటం అనేది సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.