సృజనకారుల ఒత్తిడితో శాసనాలు !

సృజనకారుల ఒత్తిడితో శాసనాలు !

సాహిత్యం అనేది మంచి చట్టాలు రావడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఉన్న చట్టాలని ప్రజలకి ఉపయోగపడే విధంగా రచనలు చేయవచ్చు. అణచివేసే చట్టాలని సాహిత్యం ద్వారా బహిరంగపరచవచ్చు. చట్టాలు అనేవి మూడు రకాలుగా తయారవుతాయి. ప్రజల కోరిక లేదా ఒత్తిడి మేరకు తయారవుతాయి. అదే విధంగా సృజనకారుల అభిప్రాయం మేరకు కూడా తయారవుతాయి, తయారు కావాలి. ఇప్పుడు ఈ రెండింటి ప్రభావం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు చట్టాలు ఎక్కువగా పాలకుల ఇష్టాల మేరకు తయారవుతున్నట్టు కనిపిస్తుంది.

ప్రజల ఒత్తిడి కారణంగా కూడా ఆ మధ్య కాలంలో వచ్చిన చట్టం ‘నిర్భయ’. ఈ చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్​లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​లో కొన్ని ప్రధానమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు మూడు కొత్త చట్టాలు వచ్చాయి. అవే భారతీయ సాక్ష్య అధినియం(ఐఈఏ), భారతీయ న్యాయ సంహిత(ఐపీసీ), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(సీఆర్​పీసీ). 

ఇవి పాలకుల కోరిక మేరకు వచ్చాయి. రచయితల రచనల్లోని కోరికల వల్ల అభిప్రాయాల ఆధారంగా కూడా చట్టాలు వస్తాయి. అయితే రచయితలు ఆ విధంగా రచనలు చేయాలి. కానీ, తెలుగులో కొద్దిమంది మాత్రమే అలాంటి రచనలు చేస్తున్నారు. చాలామంది శాసనాలు, చట్టాలు అనగానే ఆమడ దూరంలో ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గరినుంచి నిద్రించే వరకు చట్టాల ద్వారానే పాలించబడుతున్నాం.

నిర్బంధంలో ఉన్న వరవరరావు గురించి ఏవో రెండు ప్రకటనలు ఇచ్చి చాలామంది చేతులు దులుపుకుంటున్నారు తప్ప దాన్ని కావల్సినంతగా కథల్లోకి, కవిత్వంలోకి మొత్తంగా సృజనలోకి తీసుకొని రావడం లేదు. నేను ఆ మధ్య రాస్తున్న కొన్ని క్రిటికల్ లీగల్ వ్యాసాలను చదివి ఓ ఇద్దరు ముగ్గురు మిత్రులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘చాలా విషయాలని ఆర్ట్ రూపంలోకి తీసుకొని వస్తే ఎక్కువమందిని ఆకర్షిస్తాయని నువ్వంటావు కదా. ఆ పని చేయవచ్చు కదా’’ అని ఓ ఇద్దరు ఆత్మీయులు అన్నారు. నిజానికి ఆ పనిని నేను చాలాకాలంగా చేస్తున్నాను. అయితే వాళ్ళు నా నుంచి అలాంటివి మరిన్ని కోరుకుంటున్నారని అనిపించింది. వ్యాసం చేసే పని వ్యాసం చేస్తుంది. సాహిత్యం చేసేపని సాహిత్యం చేస్తుంది. కొన్ని సాహిత్యంలో ఇమడకపోవచ్చు. ఇమిడే అవకాశం ఉన్నప్పుడు అలా చేయడమే సమంజసం. సాహిత్యం అనేది ఎక్కువ కాలం బతుకుతుంది. చాలామందిని ఆకర్షిస్తుంది.

చట్టాలతో, కోర్టులతో, పోలీసులతో సంబంధం ఉన్న వాళ్లు రచయితలు అయినప్పుడు ఆ రచనల్లో వాస్తవికత ఎక్కువగా ఉండొచ్చు. అయితే మిగతా రచయితలు కూడా కొన్ని అంశాల మీద ఈ రచయితల కన్నా బాగా చెప్పగలరు. నిర్భయ, స్వేచ్ఛ, అకృత్యాల గురించి చెప్పడానికి, వ్యతిరేకించడానికి ఆ వ్యక్తి న్యాయవాదో లేదా న్యాయమూర్తో కావల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న రచయితలు ఉండవచ్చు. న్యాయవ్యవస్థ దరికి వచ్చిన రచయితలు ఉండవచ్చు. రాంగ్ రూట్​లో వెళ్తే చాలు.. ఎవరికైనా చట్టంతో సంబంధం ఏర్పడుతుంది. మన అనుభవంలోకి వచ్చిన ఏ అంశాన్నైనా మనం కవిత్వీకరించవచ్చు. కథలో చూపించవచ్చు. నవలతో విశదీకరించవచ్చు.

చార్లెస్ డికెన్స్ కొంతకాలం ఓ న్యాయవాది దగ్గర అప్రెంటీస్​గా పనిచేశాడు. ఎన్నో నవలలు  రాశాడు. పారిశ్రామిక విప్లవం వల్ల జరిగే అనర్థాలని తన నవలలో చూపించాడు. పిల్లల దుర్వినియోగం, జైళ్లలో ఉండే స్థితిగతుల మీద ఎన్నో రచనలు చేశాడు. ఆయన రచనల ప్రభావం వల్ల కొన్ని అంశాల మీద ప్రజాభిప్రాయం ఏర్పడి ప్రజలకు ఉపయోగపడే కొన్ని శాసనాలు వచ్చాయి. హ్యారియట్ బీచర్ స్టోవ్ రాసిన ‘అంకుల్ టామ్ క్యాబిన్’లో ఆఫ్రికన్ అమెరికన్లు ఎదుర్కొంటున్న బానిసత్వంలోని వేదనని చూపించారు. ఫలితంగా బానిసత్వం రద్దయ్యే శాసనం వచ్చింది. ఈ నవల రాసిన పది సంవత్సరాల తర్వాత ఆమె అబ్రహాం లింకన్​ను కలిసింది. అప్పుడాయన ‘పెద్ద యుద్దానికి దారితీసిన ఆ నవలని రాసిన చిన్నమ్మాయివి నువ్వేనన్నమాట’ అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

జాతి విచక్షణకి వ్యతిరేకంగా నోబెల్ బహుమతి పొందిన నాడైన్ గోర్డిమర్ ఎన్నో రచనలు చేశారు. ఆమె రచనల మీద ఆంక్షలని కూడా విధించారు. మండేలా జైలు శిక్షని అనుభవించడానికన్నా ముందు కోర్టులో ఇచ్చిన ప్రసంగ ప్రతి (నేను చావడానికి సిద్ధం)ని ముందుగా గోర్డిమర్ పరిశీలించింది. ఆమెను అనుసరించి ఇట్లా ఎంతోమంది రచనలు చేశారు. ఫలితంగా జాతివిచక్షణకి వ్యతిరేకంగా 1986వ సంవత్సరంలో ఓ చట్టం వచ్చింది.
అప్టన్ సింక్లెయిర్ రాసిన ది జంగిల్ (1906) నవలలో ప్రవాస కార్మికుల వ్యథలని చెప్పారు. చికాగోలోని మాంస పరిశ్రమలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలని, పరిశుభ్రత లేని వాతావరణాన్ని ఆ నవలలో వివరించారు. దాంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. ఆహారాన్ని నియంత్రిస్తూ, పరిశుభ్రతని పాటించాలంటూ అమెరికాలో కొత్త చట్టం వచ్చింది.

తెలుగులో కూడా ఇలాంటి సాహిత్యం వస్తుంది. కానీ, విమర్శకులు ఆ విషయాలని పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. అంపశయ్య నవీన్ రాసిన ‘చీకటి రోజులు’ అన్న నవలని విమర్శకులు అంతగా పట్టించుకోలేదని అనిపిస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో పోలీసులు, రాజ్యం జరిపిన అకృత్యాలని ఈ నవలలో నవీన్ బట్టబయలు చేశారు. ఈ నవలని నవీన్ డైరీ మాదిరిగా రాశారు. ఇప్పుడు దేశంలో ఉన్న చీకటి రోజులని ప్రతిబింబించే విధంగా రచనలు చేయడానికి రచయితలు జంకుతున్నారని అనిపిస్తుంది. కానీ.. రచయితలని తప్పుపట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరిని ఒక్క మాట అన్నా వారిపై దాడి చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. పత్రికలు పూర్తిగా ఏదో ఒక రాజకీయ పార్టీ పక్షంలో ఉండటం వల్ల మంచి సాహిత్యం రాకుండా పోతోంది.

మన భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 295 ఎ (299బీఎన్ఎస్ ) ఉంది. ఒక తరగతికి చెందిన మతం లేదా మతవిశ్వాసాలకు హాని కలిగించే ఉద్దేశంతో అవమానించారని కేసులు పెట్టడం మామూలు విషయంగా మారిపోయింది. ఓ రాజకీయ నాయకుడి మీద ఓ కార్టూన్ వేస్తే చాలు కేసు నమోదవుతుంది. ఆ రచయిత, ఆ కార్టూనిస్ట్ జైలుకెళ్లిపోతాడు. అసీమ్ త్రివేది వేసిన కార్టూన్ల కారణంగా అతని మీద రాజద్రోహంతో పాటు మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రాజద్రోహం సెక్షన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

ఈ రోజుల్లో చిన్న చిన్న అంశాలకే వ్యక్తుల మనోభావాలు, వ్యవస్థల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేసులు దాఖలవుతున్నాయి. కేసులు కొట్టివేయబడుతున్నాయి. ఎఫ్ఐఆర్ నుంచి కేసు అయిపోయే వరకు ఆ వ్యక్తి పడిన వేదనని అంచనా వేయలేం. ఇప్పుడు ఒక చిన్న కవిత, ఓ చిన్న ట్వీట్ కూడా కేసులు దాఖలు కావడానికి కారణభూతం అవుతున్నాయి. ఇదీ ఇప్పుడు మనదేశంలోని పరిస్థితి.

ఫేస్​బుక్​ పోస్ట్‌‌‌‌ని లైక్ చేస్తే స్కూలు పిల్లలని అరెస్టు చేసే పరిస్థితి, కార్టూన్ వేస్తే జైలుకి వెళ్లే పరిస్థితి, కవిత రాస్తే ప్రాసిక్యూషన్​ని ఎదుర్కొనే స్థితి. ఇది ఇప్పుడు మనదేశంలోని దుస్థితి. ఈ స్థితే కొనసాగుతుందా? కొనసాగదు. ఎమర్జెన్సీ తర్వాత మంచిరోజులు వచ్చాయి. ‘ఏడిఎం జబల్పూర్’ కేసుని రద్దు చేస్తూ రాజ్యాంగంలో సవరణలు వచ్చాయి. ప్రస్తుతం ఎప్పుడూ ప్రస్తుతంలా ఉండదు. మారుతుంది.

నెహ్రూని విమర్శిస్తూ కె. శివశంకర్ పిళ్లై ఎన్నో కార్టూన్లు వేశారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలకి అతను పితామహుడని చెప్పవచ్చు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతను నెహ్రూకి వ్యతిరేకంగా లెక్కలేనన్ని కార్టూన్లని వేశారు. అవి దాదాపు 4000కి మించి ఉంటాయని అంటారు. నెహ్రూ చనిపోవడానికి కొన్ని వారాల ముందు ఆయన వేసిన కార్టూన్​ని చూసి ‘‘నన్ను వదలాల్సిన పనిలేదు శంకర్’’ అని అన్నాడట. రన్నింగ్ రేస్​లో నెహ్రూ ఒక్క అడుగు దూరంలో ఉంటాడు. ఆయన చేతిలో టార్చ్​ ఉంటుంది. ఆయన కన్నా ముందు పరుగెత్తాలని వెంట పరుగెడుతున్న వ్యక్తుల్లో గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, క్రిష్ణమీనన్, ఇందిరాగాంధీ ఉంటారు. 

నెహ్రూ తన బలహీనతలని శంకర్ కార్టూన్ ద్వారా తెలుసుకునేవాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో శంకర్ తన వీక్లీ మూసేశాడు. నెహ్రూలు, అబ్రహం లింకన్​లు వస్తారు. వచ్చినా.. రాకపోయినా రచయితలు దోపిడీ ప్రపంచాన్ని తమ రచనల్లో ఎత్తిచూపాలి. మనిషి స్వేచ్ఛకి భంగం వాటిల్లినప్పుడు గొంతెత్తాలి. చట్టాలు మారినా, మారకపోయినా రాజీలేని రచనలని కొనసాగించాలి.

కథ, కవిత్వం రాసే క్రమంలో అశ్లీల పదాలని వాడటం సరికాదు. మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్ జార్ గాంధీజీ మీద ఓ వ్యంగ్య కవిత రాశాడు. అది తరచూ పత్రికల్లో ప్రచురితం అవుతూ వస్తుంది. మొదటిసారి అది 1983లో ప్రచురితం అయ్యింది. ఆ కవితని చాలామంది ప్రశంసించారు. సాహిత్య అకాడమీ ప్రచురించిన కవితా సంకలనంలో కూడా ఆ కవిత చోటు దక్కించుకుంది. 1994లో ఆయన మీద కేసు నమోదయ్యింది. చారిత్రక వ్యక్తులని ఆధారం చేసుకొని కవితలు, రచనలు చేయకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లినప్పుడు ఇది జరిగింది. దరఖాస్తులో కోరింది ఒకటి, సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది మరొకటి.

డా. మంగారి రాజేందర్
కవి, రచయిత
9440483001

NOTE : లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ​ఐడీ featureseditor@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.