కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని మెట్రో నగరాల్లోనే భూగర్భ జలాలు అత్యంత వేగంగా అడుగంటిపోతున్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. కాంక్రీట్ భవనాలు విపరీతంగా పెరిగిపోతుండడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి పూర్తిగా తగ్గిపోయి దాదాపు 80% ప్రాంతాలలో నీటి మట్టాలు 10 మీటర్ల కంటే దిగువకు చేరాయి. ఇంకుడు గుంతలు లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా మురుగు కాలువల్లోకి వెళ్తోంది. కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడా ఇంకుడు గుంతలు ఉన్నా, వాటికి సరియైన నిర్వహణ లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి.
200 గజాలు పైగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. కానీ నిబంధనలను పట్టించుకునే నాథులే లేరు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ కారణంగా 50 నుంచి 60 అంతస్తులకు పైగా ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
2025–-2026 నాటికి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏల పరిధిలో దాదాపు 200 పైగా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణ అనుమతులు పొందాయి. మరెన్నో పెండింగ్ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. ఇవేకాకుండా కొన్ని ప్రాంతాలలో పరిమితికి మించి అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్, ఐటీ కారిడార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి.
రోజుకు 12000కు పైగా ట్యాంకర్ల నీటి సరఫరా హైదరాబాదులో అధికారికంగా జరుగుతుంటే అనధికారంగా మరెన్నో ప్రైవేట్ ట్యాంకర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సప్లై ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున పెరుగుతోంది. రాబోయే రెండేళ్లలో గృహ, పారిశ్రామిక అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు 909 మిలియన్ లీటర్ల తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని అంచనా వేయడమైనది.
జలమండలి అంచనాల ప్రకారం నగరానికి ప్రతిరోజూ 813 ఎంజీడీల నీరు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 560 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే రోజుకు దాదాపు 253 ఎంజీడీల నీటి కొరత ఉంది. ఒకప్పుడు నగరానికి నీరందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు సరిపోకపోవడంతో అత్యంత ఖర్చుతో కూడిన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి నదీ జలాలపైనే ఆధారపడుతోంది.
'హైడ్రా' ఉపశమనం
నీటి ప్రాముఖ్యత, జల సంరక్షణ పెద్దగా పట్టించుకోని హైదరాబాద్ నగరవాసులు, ప్రభుత్వాలు రాబోయే ముప్పును అంచనా వేయడంలో విఫలం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే కుళాయి తిప్పగానే ప్రజలకు నీరు అందుబాటులో ఉంటున్నాయి. కానీ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేకమందికి మాత్రం నీటి కొరతే ప్రధాన సమస్యగా ఉందన్న విషయం స్ఫురించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన నీటి సదుపాయం లేని ప్రజలు దాదాపు రెండు బిలియన్ల మంది ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటంటే భూగ్రహంపై అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో 97% నీరు మహా సముద్రాలలోనే ఉంది.
మిగిలిన 3% నీటిలో 2% హిమానీ నదాలు, పర్వత ప్రాంతాలు లేదా దట్టమైన అడవుల కింద ఉంది. దీనిని వెలికితీసి వినియోగించుకునే అవకాశం మనకు ఏ మాత్రం లేదు. కాబట్టి, భూగ్రహంపై మన వినియోగం కోసం అందుబాటులో ఉన్న తాగునీరు కేవలం 1% మాత్రమే. నగరంలో కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'హైడ్రా' వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుండడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నది.
నీటితోనే మనుగడ
పైపులతో కార్లు, ద్విచక్ర వాహనాలు కడగడం, రోడ్లపై నీళ్లు వృథా చేయడం, ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి నీరు నిండి కారిపోవడం వంటి చర్యలతో నీటిని వృథా చేసేవారిపై రూ. 10,000 వరకు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే, సరైన అజమాయిషీ యంత్రాంగం లేక అనేక ప్రాంతాలలో జరగవలసిన నష్టం జరిగిపోతూనే ఉంది. ఈ సంక్షోభ సమయంలో నగరవాసులందరూ నీటి వృథాను అరికట్టి, దానిని జాగ్రత్తగా వినియోగించుకొనేవిధంగా ‘జల్ హై తో కల్ హై' వంటి నినాదాలతో జలమండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
పౌర సంఘాలు స్థానిక నాయకుల భాగస్వామ్యంతో గతంలో మాదిరిగా వాటర్ లీడర్షిప్ అండ్ కన్జర్వేషన్ అనే ప్రజా ఉద్యమాన్ని పునః ప్రారంభించాలి. శరీరంలో 60%, మెదడులో 70 శాతం, రక్తంలో 80 శాతం నీటితో మనుగడ సాగిస్తున్న మనం ఆహారం లేకుండా నెలరోజులు ఉండవచ్చు. కానీ, నీరు లేకుండా వారం రోజులు కూడా ఉండలేమన్న ఎరుకతో జల సంరక్షణ చేసుకుంటూ భావితరాలకు కూడా ఆదర్శంగా నిలవాలి. ఆచరణాత్మక ప్రణాళికలతో జలమండలి, ప్రభుత్వం కూడా నగరవాసులకు సరిపడేలా సురక్షిత నీటి సరఫరాకు ఏర్పాటు చేసుకోవాలి.
- ఆర్ సి కుమార్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
- రచయితలు 'వెలుగు'కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
