IPL 2026 Final Controversy: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో ఒక పెద్ద హైడ్రామా నడిచింది. మ్యాచ్ ముగిసినా కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ ఒక్క మూమెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆర్సీబీ రన్ చేజింగ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో కింగ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ తీవ్ర వివాదానికి దారి తీసింది.
అసలేం జరిగిందంటే?
ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో సాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ గాల్లోకి కొట్టిన షాట్‌ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్‌ఫీల్డ్‌లో ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నేలకు అతి దగ్గరగా (Low Catch) అందుకున్నాడు. గిల్ పర్ఫెక్ట్‌గా క్యాచ్ పట్టేశాననే నమ్మకంతో గుజరాత్ ప్లేయర్స్ అందరు వికెట్ పడిపోయిందంటూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోహ్లీ కూడా అవుట్ అయ్యాననే అనుకున్నాడు.. కానీ క్యాచ్ క్లీన్‌గా పట్టాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఫీల్డ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్ రివ్యూకు పంపారు. టీవీ రీప్లేలను క్షుణ్ణంగా పరిశీలించిన థర్డ్ అంపైర్.. చివరకు విరాట్ కోహ్లీని నాటౌట్‌గా ప్రకటించడంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు షాక్‌కు గురైయ్యారు.
కోహ్లీని అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?:
శుభ్‌మన్ గిల్ అంత కష్టపడి క్యాచ్ పట్టినా థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్ ఇవ్వడం వెనుక కొన్ని క్రికెట్ రూల్స్ ఉన్నాయి. మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూసిన టెలివిజన్ రీప్లేలలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.
* నేలకు తాకిన బంతి: గిల్ డ్రైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసిన చివరి క్షణంలో బంతి నేలను తాకినట్లు విజువల్స్‌లో స్పష్టంగా కనిపించింది.
* బంతి కింద లేని వేళ్లు: బంతి చేతిలో పడే సమయంలో శుభ్‌మన్ గిల్ వేళ్లు పూర్తిగా బంతి కింద లేవు.
క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి: క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ఫీల్డర్ క్యాచ్ పూర్తి చేసేటప్పుడు బంతిపై అతనికి పూర్తి నియంత్రణ ఉండాలి.. అలాగే ఆ ప్రాసెస్ ముగిసే వరకు బంతి శరీరంలో ఏ భాగానికి సపోర్ట్ ఉన్నా కూడా నేలకు మాత్రం అస్సలు తాకకూడదు.. అయితే అందుబాటులో ఉన్న వీడియో ఆధారాలను బట్టి బంతి నేలకు తాకిందని తేలడంతో థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కోహ్లీని నాటౌట్‌గా డిక్లేర్ చేశాడు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గొడవ:
థర్డ్ అంపైర్ నిర్ణయంతో లభించిన భారీ లైఫ్‌లైన్‌ను విరాట్ కోహ్లీ చక్కగా ఉపయోగించుకుని, క్రీజులో నిలబడి ఆర్సీబీని ఈజీగా విజయతీరాలకు చేర్చాడు. దాంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఈ వివాదాస్పద క్యాచ్‌పై సోషల్ మీడియాలో ఇరు జట్ల అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. గుజరాత్ ఫ్యాన్స్ అది అవుట్ అని వాదిస్తుంటే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అంపైర్ నిర్ణయం కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. కెప్టెన్ గిల్ ఒక పెద్ద వికెట్ పడగొట్టానని సంబరపడినప్పటికీ, టెక్నాలజీ ఆధారాల వల్లే కోహ్లీ బ్రతికిపోయాడనేది ఇక్కడ అసలు ముచ్చట.
It's all happening in Ahmedabad 👀
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/gczM8fnZMe
