‘బుద్ధి’ భూములేలాలని ఉంటే ‘వంతు’ వాకిలి ఊడ్వమందని సామెత! రెండింట్లోనూ విషయం భూమే, ఫలితం మాత్రం... కోరేదొకటి.. జరిగేది మరొకటి! తెలంగాణలో విద్యా విధానాన్ని సమూలంగా సంస్కరించాలని, సముద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయం గా వెల్లడించారు.
అందుకే, సదరు మంత్రిత్వశాఖను తనతోనే ఉంచుకున్నారు. కానీ, అధికారుల మధ్య సమన్వయ లోపం, విధానాల్లో వెనకా ముందు ఎటూ తేల్చని ఊగిసలాట ధోరణి, తగినంత ముందస్తు కసరత్తు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, వెనక్కి తగ్గడం వంటివి స్థూలంగా మొత్తం విద్యా విధానంలోనే గందరగోళానికి దారితీస్తున్నాయి.
ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు దాదాపు అంతటా ఇదే పరిస్థితి! దానికి తోడు, సత్సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వమే నెలకొల్పిన ‘తెలంగాణ విద్యా కమిషన్’ చైర్మన్ ఆకునూరి మురళి పదవీ కాలానికి ముందే రాజీనామా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కమిషన్ ఇచ్చిన సమగ్ర నివేదికలోని అన్ని అంశాలు అమలవుతాయా ? అన్న సందేహాలు వివిధస్థాయిల్లో ఇప్పుడు ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత విద్యా సంవత్సరం చివరన పదో తరగతి పరీక్షల నిర్వహణ మొదలుకొని ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం వరకూ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఇంటర్మీడియెట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో విలీనం చేస్తున్నట్టు ఒకసారి, లేదంటూ మరోసారి ప్రకటనలు రావడం, పూటకో సమీక్ష, రోజుకో లీక్‌తో విద్యా విధానాలపై స్పష్టత లేకపోవడం కలవరపరుస్తోంది. విద్యా మంత్రిత్వ శాఖ స్వయాన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటంతో మరింత బలోపేతమవుతుందని ప్రజలు భావించారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అంతర్గతంగా అధికారుల మధ్య సయోధ్య లేమి, బడ్జెట్‌లో ఆశించిన పెంపు లేకపోవడం వంటివి సదరు ఆశల్ని దెబ్బతీస్తున్నాయనే విమర్శలున్నాయి.
‘ఇగో’ల రాజ్యం
రాష్ట్ర విద్యాశాఖలోని వివిధ విభాగాల మధ్య ఉన్న సమన్వయ లోపం కూడా విద్యార్థులకు సమస్యగా మారింది. పాలిసెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించినప్పటికీ, అదే సమయంలో రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటం వల్ల టీసీ వంటి ధృవపత్రాలు పొందడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఎస్‌ఎస్‌సీ మెమోలు అందకపోవడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో గందరగోళం తప్పదనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఒక విభాగం తీసుకునే నిర్ణయంపై మరో విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం ఆశించినట్టుగా ఇంటర్మీడియట్ రద్దు చేసి 10+2 విద్యావిధానం ఈసారి తీసుకురాలేకపోవడానికి దారితీసిన పలు కారణాల్లో ప్రయివేట్ కాలేజీల లాబీయింగ్‌కు తోడు అధికారులు సహకరించకపోవడం, సమన్వయ లోపం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఉన్నత విద్యలోనూ సమన్వయ లోపం ఉంది. డిగ్రీ స్థాయిలో సిలబస్ మార్పు, కొత్త కోర్సుల ఆమోదం వంటి అంశాల్లో ఉన్నత విద్యామండలికి కాలేజీ కమిషనరేట్ మధ్య పొసగటం లేదు.
ఒకరు ప్రతిపాదించింది మరొకరు ఆమోదించక అసాధారణ జాప్యాలకు దారితీస్తోంది. నూతన విద్యా విధానం స్ఫూర్తి ప్రకారం ‘ఐచ్ఛిక అంశాలతో క్రెడిట్స్ పద్ధతి’ (సీబీసీఎస్)ని పాటిస్తూ ఉన్నత విద్యామండలి చేసిన కొన్ని కొత్త కోర్సుల ప్రతిపాదన కాలేజీ కమిషనరేట్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. సిలబస్ మార్పు విషయంలోనూ రెండు విభాగాల మధ్య స్పర్ధ ఉంది.
నివేదికపై చర్చేది ?
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని రాష్ట్ర విద్యా కమిషన్ రూపొందించిన ‘విజన్ ఫర్ ఇన్‌క్లూజివ్ ఎక్సలెన్స్-2026’ నివేదిక బయటకు రాగానే కీలకాంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. సిఫారసులు, అమలు సాధ్యాసాధ్యాలు, బడ్జెట్ తదితరాలపై సమగ్ర చర్చ ఇంకా జరగాల్సి ఉంది. నివేదికాంశాలతో ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల భవితవ్యంపై ఆందోళన మొదలైంది.
పదో తరగతి పరీక్షలు రద్దవుతాయనే ప్రచారం ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు ఇంటర్మీడియెట్‌ను పాఠశాల బోర్డులో విలీనం చేసే ప్రతిపాదనలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో మరింత అయోమయం నెలకొంది. రాష్ట్రంలో విద్యా విధానాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక, అధికారిక స్పష్టత, కచ్చితమైన కాలపట్టిక లేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసి, టెన్ ప్లస్ టూ విధానమనే ప్రతిపాదనలు రాగానే రాష్ట్రవ్యాప్తంగా అది చర్చకు దారితీసింది. అనంతరం తర్జనభర్జన తరువాత పాత విధానమే కొనసాగుతుందని చెప్పడం వంటివి సర్కారు నిర్ణయాలపై సందేహాలు పెంచడమే కాక విద్యావ్యవస్థ గాడి తప్పేలా చేస్తున్నాయి. పలు అభ్యంతరాల తరువాత ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి కీలక నిర్ణయాలు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సి ఉండగా, చివరి నిమిషంలో ప్రతిపాదనలు తెరపైకి తేవడం, స్పష్టత కొరవడటంతోనే గందరగోళం!.
అంతరాల ప్రమాదం
2026-27 నుంచే ఇంటర్ సిలబస్, పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్కుల పద్ధతి మార్పులు, డిజిటల్ కంటెంట్, కొత్త కోడింగ్ నమూనాలు వంటి సంస్కరణలు అమలు చేయనున్నట్టు ప్రకటించారు.
లాంగ్వేజీ పేపర్లలో ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నట్టూ చెప్పారు. హడావుడిగా నిర్ణయాలు కాకుండా సమగ్ర అధ్యయనం చేసి, విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించి అమలు చేస్తేనే అది విజయవంతమవుతుంది. ఇప్పటికిప్పుడు గ్రామీణ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ సదుపాయాలు పూర్తిగా లేవని, బోధకులకు సరైన శిక్షణ అందలేదని, కొత్త పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
పెద్ద మార్పులను అమలు చేయాలంటే కనీసం ఆరు నెలల ముందే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు, నమూనా ప్రశ్నాపత్రాలు, టీచర్ల ట్రైనింగ్, డిజిటల్ మౌలిక వసతులు సిద్ధం చేయాల్సి ఉందని విద్యావేత్తల భావన. ఇంటర్ పరీక్షా ఫలితాల సందర్భంగా ముఖ్యమంత్రి కొత్త సిలబస్ విడుదల చేస్తారని ముందు ప్రకటించారు.
ఫలితాలను సీఎం కాకుండా ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విడుదల చేసిన దరిమిలా నాడు కొత్త సిలబస్ విడుదల కాలేదు. ఆ పైన ఎలాంటి అధికారిక ప్రకటన గాని, ‘విడుదల’ గానీ లేకుండానే కొత్త సిలబస్ పుస్తకాలు రాబోతున్నాయి. విద్యా విధానంలో స్పష్టత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడిందనడానికి ఇదొక ఉదాహరణ. మౌలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండానే కొత్త ప్రయోగాలు ప్రారంభించడం సరైన విధానం కాదనేది అత్యధికుల అభిప్రాయం.
హేతుబద్ధత ముఖ్యం
తెలంగాణలో ఈసారి పదో తరగతి పరీక్షలు నెలరోజులపాటు జరిగాయి. ప్రతి పేపర్‌కు మూడు నాలుగు రోజుల విరామంతో విద్యార్థులు పరీక్షలకు బాగా సిద్ధమయ్యే అవకాశాలుంటాయని ప్రభుత్వం చెప్పినా, వాస్తవానికి పరీక్షలు ఎప్పుడు అయిపోతాయా అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పారు. సుదీర్ఘ షెడ్యూల్‌తో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, పాలిసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సరిపడ సమయం దొరకలేదు.
ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఆధారిత ప్రశ్నల విధానం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో స్థిరత్వం లేకపోవడం గందరగోళానికి కారణమైంది.
పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని ఒకసారి, ఉంటాయని మరోసారి ప్రచారం జరిగింది. అలాగే పదో తరగతిలో ఇంటర్నల్ పరీక్షల విషయంలో కూడా మొదట రద్దు చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చి, విద్యా సంవత్సరం మధ్యలో 2025 ఆగస్టు నెలలో ఇంటర్నల్ కొనసాగుతాయని ప్రకటించడంతో విద్యార్థులు హడావుడిగా రికార్డులు పూర్తి చేయాల్సి వచ్చింది.
దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
