చాలా మందికి పోదున్నే నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. కొందరైతే రాత్రి పడుకునే ముందే ఉదయాన్నే కాఫీ రెడీ ఉండేలా టైమర్ కూడా సెట్ చేసుకుంటారు. ఉదయం కాఫీ తాగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, అసలు నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం మంచిదేనా..? లేదా కొంచెంసేపు ఆగి తాగాలా..? అనే దానిపై నిపుణుల మధ్య ఇప్పటికీ చర్చ నడుస్తోంది.
కొంతమంది నిపుణులు ఉదయం కొంచెం సమయం గడిచాక లేదా మధ్యాహ్న సమయంలో కాఫీ తాగడం మంచిదని అంటుంటే, మరికొందరు మాత్రం కాఫీ తాగడానికి కచ్చితంగా ఒక బెస్ట్ టైం అంటూ ఎం లేదని చెబుతున్నారు.
ఉదయం పూట కాఫీ తాగడం
సాధారణంగా ఒక కప్పు (8 ఔన్సులు) కాఫీలో దాదాపు 100 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అనేది మన శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక పదార్థం. అందుకే ఉదయాన్నే కాఫీ తాగినప్పుడు అది మనల్ని త్వరగా నిద్రమత్తు వదిలించి, చురుకుగా మార్చడానికి సహాయపడుతుంది. కెఫీన్ మన శరీరంలో 'కార్టిసాల్' అనే హార్మోన్ పరిమాణాన్ని పెంచడం ద్వారా ఇలా జరుగుతుంది.
కాఫీకి, కార్టిసాల్ హార్మోన్‌కు ఉన్న సంబంధం ఏంటి?
కార్టిసాల్‌ను 'స్ట్రెస్ హార్మోన్' అని కూడా అంటారు. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు శరీరాన్ని అలర్ట్ చేయడానికి ఇది విడుదలవుతుంది. అలాగే, మనం నిద్రలేచినప్పుడు సహజంగానే మన శరీరం ఈ కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల మనం నిద్రమత్తు నుండి బయటపడి, చురుకుగా మారతాము.
కార్టిసాల్ సమయాలు: సాధారణంగా ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ఈ హార్మోన్ మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రోజంతా క్రమంగా తగ్గుతూ రాత్రి వేళల్లో చాలా తక్కువ స్థాయికి చేరుకుంటుంది.
కార్టిసాల్ ఇప్పటికే ఎక్కువగా ఉన్న ఉదయం పూట మనం కాఫీ తాగితే, కెఫీన్ వల్ల కార్టిసాల్ స్థాయిలు ఇంకా పెరుగుతాయి. దీనివల్ల కొంతమందికి ఉత్సాహం రావచ్చు, కానీ మరికొందరికి ఆందోళన, చిరాకు లేదా కంగారు పెరగవచ్చు.
►ALSO READ | జ్యోతిష్యం: ఏ రాశిని ఏ జంతువు శాసిస్తుంది.. ఎవరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు..!
ఆరోగ్య సమస్యలు: ఒత్తిడి వల్ల లేదా ఎక్కువ కాఫీ తాగడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటే... బరువు పెరగడం, షుగర్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రాత్రిపూట కాఫీ తాగడం
నైట్ షిఫ్ట్ చేసేవారు తప్ప, మిగిలిన వారు రాత్రి వేళల్లో కాఫీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే, మనం తాగిన కాఫీలోని సగం కెఫీన్‌ను మన శరీరం బయటకు పంపడానికి కనీసం 2 నుండి 10 గంటల సమయం పడుతుంది.
అయితే, కొంతమందికి రాత్రి 10 గంటలకు స్ట్రాంగ్ కాఫీ తాగినా వెంటనే హాయిగా నిద్ర పడుతుంది. దీనికి కారణం వారిలో ఉండే CYP1A2 అనే 'కాఫీ జన్యువు'. ఈ జన్యువు బలంగా ఉన్నవారి శరీరం కెఫీన్‌ను చాలా వేగంగా జీర్ణం చేసి బయటకు పంపేస్తుంది.
కాఫీ తాగడానికి బెస్ట్ టైం ఏది?
శాస్త్రీయంగా ఒక బెస్ట్ టైం అంటూ చెప్పలేకపోయినా, నిపుణుల ప్రకారం ఈ టైంలో కాఫీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది:
ఉదయం 9:30 నుండి 11 గంటల మధ్య ఈ సమయంలో మన శరీరంలో సహజంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు తగ్గడం మొదలవుతాయి. కాబట్టి ఈ టైమ్‌లో కాఫీ తాగితే కెఫీన్ వల్ల మనకు మంచి శక్తి, ఉత్సాహం లభిస్తాయి.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాలా మందికి భోజనం చేశాక నీరసంగా లేదా బద్ధకంగా అనిపిస్తుంది. ఒక చిన్న కునుకు తీసే అవకాశం లేనప్పుడు, ఒక కప్పు కాఫీ తాగితే మిగిలిన రోజంతా చురుకుగా పని చేసుకోవచ్చు.
రోజుకు ఎంత కాఫీ తాగవచ్చు?
అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ (FDA) నిబంధనల ప్రకారం సాధారణ పెద్దలు రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు అయితే 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి. మనం తాగే కాఫీలోనే కాకుండా చాక్లెట్లు, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా కెఫీన్ ఉంటుంది. వీటన్నింటినీ కలిపి లెక్క వేసుకోవాలి.
సాధారణంగా ప్రజలు రోజుకు సగటున 135 మిల్లీగ్రాముల కెఫీన్ అంటే దాదాపు ఒకటిన్నర కప్పుల కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఇది సురక్షితమైన పరిమితే. కాబట్టి మీ శరీర తత్వానికి ఏ సమయం సెట్ అవుతుందో చూసుకుని, ఆ సమయంలో కాఫీని ఆస్వాదించవచ్చు!
