OTT Review: ఆత్మ‌ల‌తో అంబులెన్స్ డ్రైవ‌ర్.. ఓటీటీలో అలరిస్తున్న హార్రర్ కామెడీ థ్రిల్లర్..

OTT Review: ఆత్మ‌ల‌తో అంబులెన్స్ డ్రైవ‌ర్.. ఓటీటీలో అలరిస్తున్న హార్రర్ కామెడీ థ్రిల్లర్..

మ‌ల‌యాళం కామెడీ థ్రిల్ల‌ర్ 'సుఖమానో సుఖమాను' ఓటీటీలో అలరిస్తుంది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది. కుంబ‌లంగి నైట్స్ ఫేమ్' మాథ్యూ థామ‌స్‌ హీరోగా, దేవికా సంజ‌య్ హీరోయిన్ గా నటించింది. అరుణ్ లాల్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

కథేంటంటే:

థియో (మాథ్యూ థామస్) చిన్నతనంలోనే తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోతాడు. ఆ విషాదం అతనిని తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. ఒక పెద్ద పాత ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ, చుట్టుపక్కల వారితో పెద్దగా కలవకుండా తన ప్రపంచంలోనే మునిగిపోతుంటాడు. దీంతో గ్రామస్తులు అతన్ని వింత వ్యక్తిగా, పిచ్చివాడిగా భావిస్తూ ఎగతాళి చేస్తుంటారు.

జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు థియో శ్మశానవాటిక నిర్వాహకుడు ఐప్ (జగదీష్) వద్ద అంబులెన్స్ డ్రైవర్‌గా, సహాయకుడిగా పనిచేయడం ప్రారంభిస్తాడు. అయితే ఒకరోజు అతని జీవితంలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంటుంది. తాను అంబులెన్స్‌లో తరలించే మృతుల ఆత్మలు తనకు కనిపించడం మొదలవుతుంది. అంతేకాదు, వాటితో మాట్లాడగలిగే శక్తి కూడా అతనికి వస్తుంది.

మొదటగా ఒక వృద్ధుడి ఆత్మ (స్ఫటికం జార్జ్) అతనికి పరిచయం అవుతుంది. ఆ తర్వాత మరికొన్ని ఆత్మలు అతని జీవితంలోకి వస్తాయి. కుటుంబాన్ని కోల్పోయిన థియో, ఆ ఆత్మలతోనే ఓ కొత్త కుటుంబాన్ని ఏర్పరుచుకుంటాడు. మరోవైపు చారు (దేవిక సంజయ్) అనే యువతిని ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలి? ఈ ప్రయాణంలో ఆ ‘ఆత్మల కుటుంబం’ అతనికి ఎలా తోడ్పడింది? చివరకు థియో జీవితంలో సంతోషం చోటుచేసుకుందా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఒంటరితనం, ప్రేమ, కుటుంబ బంధాలు, జీవితం-మరణం మధ్య ఉన్న భావోద్వేగాలను ఫాంటసీ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి దర్శకుడు అరుణ్‌లాల్ రామచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథలో ఆత్మలు ఉన్నప్పటికీ, భయపెట్టే ప్రయత్నం చేయకుండా వాటిని హృదయానికి దగ్గరైన పాత్రలుగా చూపించడం ప్రత్యేకత.

►ALSO READ | Lokesh Kanagaraj: లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ పోస్ట్

మాథ్యూ థామస్ థియో పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒంటరితనంతో బాధపడే యువకుడి భావోద్వేగాలను సహజంగా తెరపై ఆవిష్కరించాడు. దేవిక సంజయ్ తన పాత్రకు న్యాయం చేయగా, జగదీష్, స్ఫటికం జార్జ్ తమ అనుభవంతో కథకు బలాన్ని అందించారు.

సినిమాలో కామెడీ, ఎమోషన్, ఫాంటసీ అంశాలు సమతుల్యంగా సాగుతాయి. ముఖ్యంగా ఆత్మలతో థియో మధ్య జరిగే సన్నివేశాలు నవ్వులు పంచడంతో పాటు హృదయాన్ని కూడా తాకుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కథ మూడ్‌కు తగ్గట్టుగా ఆకట్టుకుంటాయి.

‘సుఖమానో సుఖమన్న’ ఒక ఫీల్‌గుడ్ ఫాంటసీ డ్రామా. ఒంటరితనం, ప్రేమ, కుటుంబ అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ చిత్రం భావోద్వేగ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. హారర్ కంటే హార్ట్ ఎక్కువగా ఉన్న ఈ సినిమా వీకెండ్‌లో ఓసారి చూడొచ్చు.