రూ. 10వేలు దాటితే ఆన్‌లైన్ పేమెంట్ 1 గంట లేట్ ? ఆర్బీఐ కొత్త రూల్ !

 రూ. 10వేలు దాటితే ఆన్‌లైన్ పేమెంట్ 1 గంట లేట్ ? ఆర్బీఐ కొత్త రూల్ !

మన దేశంలో  ఆన్‌లైన్ పేమెంట్స్ అంటేనే వేగంగా సెకన్లలో జరిగేది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పిన్ నొక్కడం, డబ్బులు వెళ్ళిపోవడం.. ఇదంతా సెకన్లలో జరిగిపోతుంది. కానీ, ఈ వేగాన్ని కొద్దిగా తగ్గించడం వల్లే మన డబ్బు మరింత సురక్షితంగా ఉంటుందంటే మీరు నమ్ముతారా..?

అవును,.... ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపే విధానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద మార్పును తీసుకురావాలని ఆలోచిస్తోంది. కొన్ని రకాల ట్రాన్సక్షన్ పై ఒక గంట పాటు ఆలస్యం చేసే నిబంధనను ప్రతిపాదించింది. మొదటిసారి వినడానికి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించిన.. రోజురోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాల నుండి సామాన్య ప్రజలను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం.

 ఎందుకు ఈ నిర్ణయం
గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మోసగాళ్లు ఫోన్లు చేసి భయపెట్టడమో, ఆశ చూపించడమో చేసి.. బాధితులతోనే స్వయంగా వారి అకౌంట్ల నుండి డబ్బులు పంపించుకుంటున్నారు. ఒక్కసారి డబ్బులు అకౌంట్ నుండి వేరే వాళ్లకు వెళ్ళిపోతే, దాన్ని మళ్లీ వెనక్కి రాబట్టడం చాలా కష్టంగా మారుతోంది. అందుకే, ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్‌బిఐ ఒక సరికొత్త సేఫ్టీ & సెక్యూరిటీ సృష్టించాలనుకుంటోంది.

1 గంట ఆలస్యం 
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఎవరైనా రూ.10 వేల కంటే ఎక్కువ డబ్బు  ఆన్‌లైన్ ద్వారా పంపినప్పుడు, ఆ ట్రాన్సక్షన్ పూర్తి కావడానికి ఒక గంట సమయం పడుతుంది. ఎలా అంటే.. మీరు డబ్బులు పంపిన వెంటనే మీ అకౌంట్ నుండి ఆ మొత్తం కట్ అవుతుంది కానీ, అది రిసీవర్ అకౌంట్‌కు వెంటనే చేరదు. దీని వల్ల లాభం ఏంటి అంటే  ఒకవేళ మీరు పొరపాటున ఎవరికైనా మోసపోయి డబ్బులు పంపినట్లు గుర్తిస్తే, ఆ ఒక గంట లోపు మీరు ఆ ట్రాన్సక్షన్  క్యాన్సల్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకులు కూడా ఈ సమయంలో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి వినియోగదారులను అలర్ట్  చేయవచ్చు.

ఏ పేమెంట్  వెంటనే జరుగుతాయి
సాధారణ ప్రజల ప్రతిరోజు అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్‌బిఐ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. మీరు చేసే డైలీ  షాపింగ్ పేమెంట్స్, కరెంట్ బిల్లులు, ఫోన్ రీఛార్జ్‌లు,  రోజు తప్పకుండా చేసే బిల్లు పేమెంట్స్ ఎప్పటిలాగే వెంటనే జరిగిపోతాయి. మీరు ఎప్పుడూ డబ్బులు పంపే నమ్మకమైన వ్యక్తుల  అకౌంట్లకు చేసే ట్రాన్సక్షన్ కూడా ఈ ఆలస్యం వర్తించదు. కాబట్టి మీ సాధారణ యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ వాడకానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వృద్ధులకు, వికలాంగులకు  రక్షణ
ఆన్‌లైన్ మోసగాళ్లు ఎక్కువగా వృద్ధులను, అమాయకులను టార్గెట్ చేస్తుంటారు. అందుకే ఈ ప్రతిపాదనలో వారి కోసం ప్రత్యేక రక్షణ కల్పించారు. వృద్ధులు లేదా వికలాంగులు రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆన్‌లైన్ లో పంపాలనుకున్నప్పుడు.. ఆ ట్రాన్సక్షన్స్ పూర్తి కావడానికి ముందు వారు  కుటుంబైకులు లేదా స్నేహితుల నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీనివల్ల భయపెట్టి డబ్బులు గుంజడం వంటి మోసాలను ఆపవచ్చు.

చేతికి  కిల్ స్విచ్
ప్రజలకు వారి అకౌంట్లపై ఫుల్ కంట్రోల్ ఇచ్చేందుకు ఆర్‌బిఐ మరికొన్ని ఫీచర్లను తీసుకురాబోతోంది. మీకు నచ్చినప్పుడు యూపీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా యూనివర్సల్ కిల్ స్విచ్ అనే ఫీచర్‌ను ప్రతిపాదించారు. మీ అకౌంట్ హ్యాక్ అయిందని లేదా మోసం జరిగిందని మీకు అనుమానం వస్తే, ఈ స్విచ్ నొక్కడం ద్వారా సెకన్లలో మీ అన్ని రకాల డిజిటల్ ట్రాన్సక్షన్ ఆపేయవచ్చు. 

►ALSO READ | BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ ఆఫర్: తక్కువ ధరకే రోజుకు 3GB డేటాతో 2 నెలలకు పైగా వ్యాలిడిటీ!

ఫేక్ అకౌంట్ల పై కఠిన చర్యలు
మోసగాళ్లు ప్రజల నుండి కొట్టేసిన డబ్బును దాచడానికి ఇతరుల పేర్లపై ఉండే నకిలీ లేదా తప్పుడు బ్యాంక్ అకౌంట్స్  వాడుతుంటారు. దీనికి చెక్ పెట్టడానికి సరైన గుర్తింపు కార్డులు (KYC) లేని అకౌంట్లలో ఏడాదికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కాకుండా ఆర్‌బిఐ పరిమితి విధించనుంది. ఆ పరిమితి దాటితే బ్యాంకులు ఆ డబ్బును నిలిపివేసి, పూర్తి విచారణ జరిపిన తర్వాతే అనుమతిస్తాయి. తప్పు అని తేలితే ఆ డబ్బును తిరిగి పంపేస్తాయి.

వేగం కంటే భద్రతే ముఖ్యం
ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్ అంటే ఎంత వేగంగా జరిగాయి అనేదే ముఖ్యం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆర్‌బిఐ ఆలోచన మారుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు వేగం కంటే భద్రత ముఖ్యం అనే విషయాన్ని ఈ ప్రతిపాదన గుర్తు చేస్తోంది.  

 ఎప్పటి నుండి అమలులోకి 
ఈ ప్రతిపాదనలు  ఇంకా చట్టంగా మారలేదు, కేవలం ఆర్‌బిఐ పెట్టిన ఒక ప్రతిపాదన మాత్రమే. దీనిపై ప్రజలు, బ్యాంకుల అభిప్రాయాలను సేకరించడానికి 2026, మే  వరకు సమయం ఇచ్చారు. ఆ సూచనలన్నింటినీ పరిశీలించిన తర్వాతే రిజర్వ్ బ్యాంక్ చివరి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ   ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, భవిష్యత్తులో మన ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ మరింత సురక్షితంగా మారడం ఖాయం.