లిఫ్ట్ ఇస్తానని ఊరిచివరకు తీసుకెళ్లి అసభ్యప్రవర్తన ..కలెక్టరేట్ లో అటెండర్ ను చెప్పుతో కొట్టిన మహిళ

లిఫ్ట్ ఇస్తానని ఊరిచివరకు తీసుకెళ్లి అసభ్యప్రవర్తన ..కలెక్టరేట్ లో అటెండర్ ను చెప్పుతో కొట్టిన మహిళ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  ఓ ప్రభుత్వ ఉద్యోగికి దేహశుద్ధి జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే జరుగుతున్న సమయంలోనే కలెక్టరేట్ ఏఓ పవన్ దగ్గర అటెండర్‌గా పనిచేస్తున్న మురళి అనే ప్రభుత్వ ఉద్యోగిపై  ఒక మహిళ, ఆమె కుటుంబ సభ్యులు చెప్పులతో చితకబాదారు. 

అసలేం జరిగిందంటే.?

పర్వతిగిరి గ్రామానికి చెందిన సదరు మహిళ.. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో తన భూమి పోవడంతో, దానికి సంబంధించిన నష్టపరిహారం కోసం కలెక్టరేట్‌కు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న అటెండర్ మురళి.. నీ పని చేసిపెడతాను, లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి ఆమెను తన బైక్ ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను ఊరిచివరికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన ఆ మహిళ.. అతడిని తీవ్రంగా ప్రతిఘటించి, అక్కడ నుంచి ఊరిలోకి పారిపోయింది.

అయినప్పటికీ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సదరు బాధితురాలు ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి అసలు విషయం తెలుసుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు మరియు స్థానిక పర్వతిగిరి సర్పంచ్... నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గ్రీవెన్స్ జరుగుతున్న ప్రాంతంలోనే ఆ కామాంధుడిని పట్టుకుని చెప్పులతో సామూహికంగా దేహశుద్ధి చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ పవన్‌కు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.

 సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకుని ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన ఆ అటెండర్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని, కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.