రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం స్టేజ్ వద్ద నిన్న జరిగిన ఆ ఘోర రోడ్డు ప్రమాదం.. ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మొదట ఇది కేవలం స్కార్పియో అదుపుతప్పి జరిగిన ప్రమాదమని అందరూ భావించారు. కానీ.. తాజాగా బయటకు వచ్చిన రెండో సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి
ప్రమాదానికి అసలు కారణం ఇదేనా?
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం అతివేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. స్కార్పియో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక్కసారిగా ఎడమవైపునకు దూసుకువచ్చింది. బస్సు వేగానికి బెంబేలెత్తిన స్కార్పియో డ్రైవర్, వాహనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వేగంగా ఉన్న స్కార్పియో.. బస్సు కోసం ఎదురుచూస్తున్న అమాయక ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది
ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ చూసిన వారంతా ఆర్టీసీ ఎలక్ట్రిక్ అద్దె బస్సుల భద్రతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలు ఈ బస్సు డ్రైవర్లకు సరైన అనుభవం ఉందా?తగిన శిక్షణ లేకుండానే ఈ ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి వదులుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
