కవిత ఇంటి వద్ద సంబురాలు

కవిత ఇంటి వద్ద సంబురాలు

హైదరాబాద్, వెలుగు : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్​బిల్లుకు కేంద్ర కేబినెట్​ఆమోదం తెలపడం, మంగళవారం లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద సంబురాలు చేశారు. పలువురు మహిళా నేతలు బంజారాహిల్స్​లోని ఆమె నివాసానికి చేరుకొని కవితకు అభినందనలు తెలిపారు. మహిళా బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద కవిత ఒక్క రోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దేశంలోని 47 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. కాగా, బిల్లును పార్లమెంట్​ ఆమోదిస్తుందని ఆశిస్తున్నానని కవిత తెలిపారు. 

దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్, కేసీఆర్ స్ఫూర్తితోనే మహిళా బిల్లు కోసం ఉద్యమించామన్నారు. ఓబీసీల సంఖ్య తేలాలంటే కుల గణన చేయాలని, డీలిమిటేషన్​ఎప్పుడు చేస్తారు? ఈ బిల్లును ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారనే అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్​చేశారు. 

బిల్లుకు ఉభయ సభల్లో బీఆర్ఎస్​మద్దతునిస్తుందని తెలిపారు. అలాగే, మంగళవారం సెర్ప్​హెడ్​ఆఫీస్​లో కవిత ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలో 40 మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సెర్ప్​ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.