- వ్యక్తిగత వివరాలు సేకరించబోం
- హౌస్ లిస్టింగ్ షురూ అయ్యింది
- 14 నుంచి ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వస్తరు
- 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తే చాలు
- జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జనగణన ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి కాగా, ఇంటింటికీ వెళ్లి హౌజ్ లిస్టింగ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, సెన్సస్ క్యూర్ పరిధి స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారన్నారు.
ప్రజలు ఎలాంటి సందేహం లేకుండా ఎన్యూమరేటర్‌కు వివరాలు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్ 26 నుంచి కొనసాగిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో లక్షా 20 వేల మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు హౌజ్ మ్యాపింగ్ పనులు చేపట్టనున్నారని, లేఅవుట్ మ్యాప్స్ ఆధారంగా తమకు కేటాయించిన ఇండ్లను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపింగ్ చేస్తున్నారన్నారు.
21 వేల మంది ఎన్యూమరేటర్లు..
క్యూర్ పరిధిలో 19 వేల 868 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ఉన్నాయని, గురువారం నుంచి ఇంటింటికి తిరుగుతూ కుటుంబాల వివరాలను సేకరిస్తారన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ కు 200 నుంచి 300 ఇండ్లు కేటాయించగా, ప్రతి 8 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్, ప్రతి వార్డుకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 21 వేల 773 మంది ఎన్యూమరేటర్లు, 3 వేల 400 మంది సూపర్వైజర్లు డ్యూటీలు నిర్వహిస్తున్నారన్నారు.
యజమాని పేరు, ఫోన్ నంబర్ మస్ట్
సర్వేలో భాగంగా 33 ప్రశ్నలు అడుగుతామని, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించబోమని స్పష్టం చేశారు. కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు మాత్రం తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని, ఒక్కో ఇంట్లో సర్వే పూర్తి కావడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుందని చెప్పారు. ఇంట్లో ఎవరైనా ఒకరు ఉన్నా సరిపోతుందని, డోర్ లాక్ ఉంటే మళ్లీ వస్తామని తెలిపారు. ప్రజలు ఇచ్చే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, ఆర్టీఐ ద్వారా కానీ, కోర్టుల ద్వారా కానీ ఈ డేటాను ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్న వారు తమకు వచ్చిన ఐడీని చూపిస్తే సరిపోతుందని, సేకరించిన సమాచారాన్ని పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో నమోదు చేస్తామన్నారు. నగరంలోని అన్ని రకాల బిల్డింగులను ఈ సర్వేలో కవర్ చేయనున్నామని, ఇండ్లతో పాటు కమర్షియల్ బిల్డింగ్స్, హోటల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, అనాథాశ్రమాలు కూడా హౌజ్ లిస్టింగ్ లో భాగం కానున్నాయన్నారు. ఒకే కిచెన్ ఉపయోగించే వారిని ఒక కుటుంబంగా పరిగణించనున్నట్లు తెలిపారు.
