సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు

సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు
  •  న్యాయపరమైన సమస్యల్లేకుండా బిల్లు తెస్తం: భట్టి
  • బీసీ సబ్ ప్లాన్ నూ అమలు చేస్తం 
  • సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు తెలంగాణ పునాది అవుతున్నదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వరోగ నివారిణి అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ‘‘లా సెక్రటరీతో మాట్లాడాకే తీర్మానం పెట్టాం. కులగణనపై న్యాయపరమైన సమస్యల్లేకుండా బిల్లు తీసుకొస్తాం. సర్వే పూర్తయ్యాక అన్ని వర్గాలు, మేధావులు, న్యాయ నిపుణులతో చర్చించి బిల్లు ప్రవేశపెడతాం. బీసీ సబ్​ప్లాన్​పైనా ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కచ్చితంగా అమలు చేస్తాం” అని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై భట్టి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్​భావిస్తున్నదని తెలిపారు. 

‘‘దేశంలోని సంపద, రాజ్యాధికారం జనాభా దామాషా ప్రకారం దక్కాలని మా పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకోసం తెలంగాణ నుంచే కులగణన చేస్తామని ఎన్నికలప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. కులగణనతో పాటు సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఎంప్లాయ్​మెంట్​అంశాలపై సర్వే చేస్తాం” అని వెల్లడించారు. సంపదను జనాభా దామాషా ప్రకారం పంచేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని పేర్కొన్నారు. కులగణనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు తెలంగాణ పునాది అవుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్లు పాలించి కులగణన చేయలేదని, కానీ తాము మంచి కార్యక్రమం చేస్తుంటే రన్నింగ్​కామెంట్రీ చేస్తున్నదని ఫైర్ అయ్యారు. 

కేబినెట్ లో చర్చించే తీర్మానం.. 

సభలో సీఎం లేరని ప్రతిపక్షాలు అనడం సరైంది కాదని భట్టి పేర్కొన్నారు. తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే కేబినెట్​లో దానిపై చర్చించామని వివరించారు. ‘‘బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్​ మూల సిద్ధాంతం. ఇప్పటికైనా వాళ్లకు జనాభా దామాషా ప్రకారం సంపదలో వాటా దక్కకుంటే అన్యాయం చేసిన వాళ్లమవుతాం. నిజానికి 2011లోనే మన్మోహన్​సింగ్​నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనపెట్టింది. తీర్మానానికి పార్టీలకు అతీతంగా మద్దతు పలికినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏనాడూ రూ.6 వేల కోట్లకు మించి బడ్జెట్​పెట్ట లేదని మండిపడ్డారు.