నల్గొండ, వెలుగు: 2027 జనగణన ప్రక్రియలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే గడువు ఉందని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన జనగణన వాక్ ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 26న ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియ ముగియనుందని, ఇప్పటివరకు జిల్లాలో 12 వేల కుటుంబాలు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. ఈ నెల 11 నుంచి ఎన్యుమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి హౌస్ లిస్టింగ్ చేస్తారని వెల్లడించారు. జిల్లాలోని సుమారు 5.50 లక్షల ఇండ్లలోని ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్లో....
కందనూలు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణన ప్రాముఖ్యతను తెలియజేస్తూ శుక్రవారం జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి పునాది లాంటిదని, పది ఏండ్లకోసారి సేకరించే ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను రూపొందిస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా సిబ్బందికి సహకరించాలని కోరారు.
అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 18 కేంద్రాల్లో మొత్తం 6,557 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
