
ముంబై: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్ల వ్యవహారంలో కేంద్రం సున్నితంగా వ్యవహరిస్తోందని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ అన్నారు. తమ ఆరోపణలపై విచారణ కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అంగీకరించామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ‘రెజ్లర్ల నిరసన వ్యవహారం కేంద్రం దృష్టిలో ఉంది. ఈ విషయాన్ని చాలా సున్నితంగా పరిష్కరించాలి.
ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రెజ్లర్లు అడిగారు. రెజ్లర్లు కోరుకున్న విధంగానే నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేశాం. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారు. మిగతా డిమాండ్లపై మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీం కోర్టు సూచించింది’ అని ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే రెజ్లర్లను అణగదొక్కేలా ఎలాంటి చర్యలు ఉండవన్నారు. రెజ్లర్లు ఓపికగా ఉండటంతో పాటు సుప్రీం కోర్టుపై విశ్వాసం ఉంచాలని ఠాకూర్ కోరారు.