కశ్మీర్లో టెర్రరిజానికి మూలం.. జమాతే ఇస్లామీ: బ్యాన్ చేసిన కేంద్రం

కశ్మీర్లో టెర్రరిజానికి మూలం.. జమాతే ఇస్లామీ: బ్యాన్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని పేర్కొంటూ దీన్ని చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ యువతను రెచ్చగొడుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహిస్తోందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ ను ఒక ఇస్లాం రాజ్యంగా మార్చి, భారత్ నుంచి వేరు చేయాలని జమాతే ప్రయత్నిస్తోందని కేంద్రం నోటిఫికేషన్ లో తెలిపింది. దేశ వ్యతిరేక ప్రచారం చేస్తూ యువతను వేర్పాటు వాదం వైపు రెచ్చగొడుతోందని, దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని చెప్పింది. దేశ భద్రతకు భంగం కలిగిస్తోందని, జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని, అందుకే ఉపా చట్టం కింద దీన్ని నిషేధిస్తున్నామని వివరించింది.

కశ్మీర్ లో ఉగ్ర మూలాలపై చెక్

పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతికి పాల్పడింది కశ్మీర్ యువకుడే. దీంతో కశ్మీర్ లోయలో ఉగ్రవాద మూలాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇక్కడి యువత ఉగ్రవాదం వైపు అడుగులు వేయడానికి కారణాలను అన్వేషించే పనిలో పడింది. ముష్కర మూకల వైపు ఆకర్షిస్తున్న వారిని గుర్తించి అణచివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత శనివారం వేర్పాటువాద సంస్థల నేతలు మాలిక్ సహా 30 మంది సభ్యుల ఇళ్లపై కశ్మీర్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రైడ్లు చేసి.. అరెస్టు చేశాయి.

యువతలో దేశ వ్యతిరేక ఆలోచనలకు మూలం

కశ్మీర్ యువతను పాకిస్థాన్ అనుకూల శక్తుల వైపు నడుపుతోంది జమాతే ఇస్లామీనేనని దర్యాప్తు సంస్థలు కేంద్రానికి నివేదించాయి. ఇక్కడి వారిలో దేశ వ్యతిరేక ఆలోచనలను రేకెత్తించి, భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొడుతోందని తెలిపాయి. 1953లో ప్రత్యేక రాజ్యాంగం రాసుకుని, జమ్ము కశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్బుల్ మొజాహిద్దీన్ సంస్థకు వెన్నుదన్నుగా ఉంది కూడా జమాతేనే. ఆ సంస్థను ఏర్పాటు చేయడం మొదలు, దానికి రిక్రూట్మెంట్, నిధుల సేకరణ, ఆయుధాల సమీకరణ చేసి పెడుతోంది. జమాతే మిలిటెంట్ వింగ్ హిజ్బుల్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలిపాయి.