స్కూల్ ఎడ్యుకేషన్ లెక్కలపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రతి ఏడాది రాష్ట్రాలు పంపించే యూడైస్ లెక్కలను క్రాస్ చెక్ చేయాలని నిర్ణయించింది. పలు రాష్ట్రాలు తప్పుడు లెక్కలు ఇచ్చినట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్(యూడైస్) పేరిట విద్యాగణాంకాలు సేకరిస్తుంటారు. నిర్ణీత ఫార్మాట్‌లో స్కూల్‌లోని వసతులు, విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల వివరాలను తీసుకుని, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. వీటి ఆధారంగా ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర అధికారులు ఏటా ప్రత్యేక బుక్‌లెట్‌నూ రూపొందిస్తుంటారు. ఇప్పటివరకూ ఎలాంటి క్రాస్ చెకింగ్ లేకుండా రాష్ట్ర విద్యాశాఖ పంపిన లెక్కలను కేంద్రం నిజమైన గణాంకాలుగా గుర్తిస్తోంది. ఈ లెక్కల ఆధారంగానే రాష్ట్రానికి నిధులను కేటాయిస్తుంటుంది.
స్టూడెంట్స్‌తో క్రాస్ చెకింగ్..
విద్యాశాఖ ఇచ్చే గణాంకాలపై క్రాస్‌చెకింగ్ కోసం డీఈడీ, బీఈడీ విద్యార్థులను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. క్రాస్ చెకింగ్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నది. దీని ఆధారంగా ప్రతి స్కూల్ వివరాలను స్టూడెంట్స్‌తో క్రాస్ చేయించనున్నారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఒకటి, రెండు రోజుల్లో కేంద్రం విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

