- దేశంలోని 70 శాతం కేసులు ఇక్కడే
- హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ పెంచుకోవాలని సూచన
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 11 మున్సిపాలిటీలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. మొత్తం కేసుల్లో 70 శాతం రికార్డయిన ఈ మున్సిపాలిటీల్లో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచుకోవాలని చెప్పింది. ఐసోలేషన్, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్లను సమకూర్చుకోవాలంది. వైరస్‌పై పోరులో మరో 2 నెలలు ముఖ్యమని.. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అర్బన్ స్లమ్స్‌లో మానిటరింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ 11 మున్సిపాలిటీలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో ఉన్నాయని వెల్లడించింది. ఈమేరకు ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో కేంద్ర హెల్త్ సెక్రటరీ ప్రీతి సుడాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మరణాలు తగ్గించేందుకు క్లినికల్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టం చేసుకోవాలన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ పెంచాలని సూచించారు. దేశంలో ఇప్పటికే లక్షా 31 వేల కేసులు నమోదయ్యాయని, అయితే 54 వేల మందికి పైగా కోలుకున్నారని, ఇది మొత్తం కేసుల్లో 41 శాతమని సుడాన్ వివరించారు. కంటెయిన్‌మెంట్, బఫ్ఫర్ జోన్లకు సంబంధించి అధికారులకు బ్రీఫింగ్ చేశారు. వేరే వ్యాధులున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

