ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే: సుప్రీంకోర్టు

ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఖాళీ కడుపుతో ఎవరూ నిద్రపోకూడదని, మన సంస్కృతి చెప్పే మాట ఇదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. నేషనల్​ ఫుడ్​ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎఫ్​ఎస్ఏ) కింద​చివరి వ్యక్తి వరకు ఆహారాన్ని అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈశ్రమ్​ పోర్టల్​లో నమోదైన వలస, అసంఘటిత రంగ కార్మికుల సంఖ్యపై తాజా నివేదిక సమర్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ ఎంఆర్ షా, హిమా కోహ్లీతో కూడిన బెంచ్​ కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్రం ఏమీ చేయడం లేదని తాము చెప్పడం లేదని, కరోనా సమయంలో ప్రజలకు ఆహారం అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని, అయితే ఇది కొనసాగాలని తాము భావిస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ల సమయంలో వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన పిల్​పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్లు అంజలీ భరద్వాజ్, హర్షా మందేర్, జగ్దీప్ ఛోకర్ తరపున అడ్వొకేట్​ ప్రశాంత్​ భూషణ్​ వాదనలు వినిపించారు.