తెలంగాణ నుంచి 74 లక్షల టన్నుల ధాన్యం తీస్కుంటాం:కేంద్రం

తెలంగాణ నుంచి 74 లక్షల టన్నుల ధాన్యం తీస్కుంటాం:కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 2022–23 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంసీ)కు సంబంధించి 74. 62 లక్షల మెట్రిక్ టన్ను(ఎల్ఎంటీ)ల ధాన్యాన్ని సేకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర సర్కార్, ఫుడ్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎఫ్ సీఐ) సమన్వయంతో ఈ ధాన్యం సేకరణ జరుగుతోందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌‌ జ్యోతి తెలిపారు. లోక్ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రం నుంచి రూ.9,212.63 కోట్ల విలువచేసే 44.72 ఎల్‌‌ఎంటీల ధాన్యాన్ని ఎంఎస్పీ ప్రకారం సేకరించినట్లు తెలిపారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రం నుంచి 502.86 ఎల్ఎంటీ ల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు. ఇందులో 2017–18లో 54 ఎల్ఎంటీలు, 2018–19 లో 77.46 ఎల్ఎంటీలు, 2019–20 లో 111.26 ఎల్ఎంటీ లు, 2020–21 లో141.09 ఎల్ఎంటీలు, 2021–22 లో 119.05 ఎల్ఎంటీలు సేకరించినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా, తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్‌‌ ఇండికేషన్‌‌(జీఐ) సర్టిఫికెట్ కోసం 2020, సెప్టెంబర్ 24న దరఖాస్తు అందిందని, ఈ నెల 6వ తేదీన జీఐ సర్టిఫికేట్ జారీ అయిందని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్‌‌ సమాధానం ఇచ్చారు.