నేడు ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌కు  కేంద్ర మంత్రులు

నేడు ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌కు  కేంద్ర మంత్రులు

గోదావరిఖని, వెలుగు:  రామగుండం ఫెర్టిలైజర్స్‌‌, కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ఫ్యాక్టరీని  కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్‌‌సుఖ్‌‌ మాండవీయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌‌ రెడ్డి శనివారం విజిట్ చేయనున్నారు. రూ.6,200 కోట్లతో 2015లో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చివరి దశకు  చేరుకున్నది. కోవిడ్‌‌ –19 వల్ల పనులు కొంత ఆలస్యం కాగా, వాటిని పూర్తి చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో ఎన్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, ఈఐఎల్‌‌, ఎఫ్‌సీఐఎల్, తెలంగాణ ప్రభుత్వంతో పాటు అల్దార్‌‌టాప్స్‌, జీఐటీఎల్‌‌ అనే గ్యాస్‌‌‌ కంపెనీ కూడా వాటాలను పొందింది. ఈ క్రమంలో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో పనుల పురోగతిపై కేంద్ర మంత్రులు సమీక్ష చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హెలీ క్యాప్టర్‌‌ ద్వారా రామగుండం ఎన్టీపీసీకి చేరుకుని మధ్యాహ్నం 3 గంటల వరకు  సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత  ఫ్యాక్టరీని సందర్శిస్తారు. వీరి వెంట పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ  రాష్ట్ర కోర్‌‌ కమిటీ సభ్యులు వివేక్‌‌ వెంకటస్వామి, ఇతర నేతలు ఉంటారు. కాగా కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి డీసీపీ రవీందర్‌‌, అడ్మిన్‌‌ అడిషనల్‌‌ డీసీపీ అశోక్‌‌ కుమార్‌‌, ఇతర పోలీస్‌‌ అధికారులు ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్యాక్టరీకి వెళ్లి  బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.