ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     స్కీమ్​లో మార్పులు లేకుండా అమలు చేసేలా బీజేపీపై పోరాడుతం: వంశీకృష్ణ
  •     సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ పెంపునకు కృషి చేస్త
  •     కార్మిక సంక్షేమం, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్త
  •     గంగారంలో రైతులతో కలిసి నాట్లు వేసిన పెద్దపల్లి ఎంపీ 

పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు:  ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. ఓదెలలో నిర్మించనున్న ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ కోసం స్థలం పరిశీలించేందుకు వెళ్తున్న ఎంపీ.. కాల్వ శ్రీరాంపూర్​ మండలం గంగారం వద్ద పొలంలో నాట్లు వేస్తున్న రైతులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి నాట్లు వేశారు. 

అనంతరం కూలీలతో భోజనం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ పడుతుందా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఉపాధి హామీ రద్దు చేస్తే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రను పార్లమెంటులో తిప్పికొట్టామన్నారు. భవిష్యత్‌‌‌‌లోనూ ఉపాధి హామీ పథకంలో ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేసేలా కేంద్రంపై పోరాడుతామని చెప్పారు. 

దేశ ఆర్థిక వ్యవస్థకు బొగ్గు గని కార్మికులే పునాది

బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని, వారి వల్లే దేశానికి వెలుగులు ప్రసరిస్తున్నాయని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. వారి భద్రత, సంక్షేమం, సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీడీకే 11వ భూగర్భ గనిలోని 3వ సీమ్, 46వ లెవల్‌‌‌‌లో కంటిన్యూయస్ మైనర్ యంత్రం ద్వారా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి పనులను గని లోపలికి ఆరు కిలోమీటర్లు వెళ్లి పరిశీలించారు. అంతకుముందు గని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా కార్మికులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

కార్మికుల భద్రత చర్యలు, సేఫ్టీ పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే చర్యలు, పని పరిస్థితుల గురించి చర్చించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు, మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడుతానని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు. 

సింగరేణి కార్మికుల సంక్షేమంపై మేనేజ్‌‌‌‌మెంట్ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసించారు. ఎంపీ వెంట సింగరేణి జీఎం డి.లలిత్ కుమార్, మైన్ ఏజంట్ చిలుక శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రఘునాథ్, సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.వీరారెడ్డి, ఐఎన్ టీయూసీ పిట్​సెక్రటరీ నాయిని శంకర్, లీడర్లు కామ విజయ్, రాచకొండ కోటేశ్వర్లు, తిప్పారపు మధు, మాదాసు విజయ్, సతీష్, చింతల శ్రీనివాస్, విజయ్, రవి తదితరులు పాల్గొన్నారు. 

పెన్షన్ ​పెంపునకు కృషి చేస్తా..

 సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్​పెంపునకు కృషి చేస్తానని, ఈ విషయంపై ఇప్పటికే పార్లమెంటులో మాట్లాడానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పింఛన్ రూ.10 వేలకు పెంచేలా పోరాడతానన్నారు. కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు. రామగిరి మండలం సెంటనరీ కాలనీలో రిటైర్డ్ కార్మికులు ఎంపీని సన్మానించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో సింగరేణి సంస్థను కాకా వెంకటస్వామి కాపాడారని, అదే తనకు స్ఫూర్తిగా మారిందన్నారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.100 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంటు సమావేశాల్లో సానుకూలత వ్యక్తం చేసిందని చెప్పారు. రామగిరి ఖిల్లా అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో ఇప్పటికే రూ.1.5 కోట్లను అటవీ శాఖకు అందజేశామని చెప్పారు. 

మరోవైపు, ఓదెల ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ నిర్మాణంలో అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ పక్కాగా ఉండేలా చూడాలని అధికారులకు ఎంపీ వంశీకృష్ణ సూచించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌ సూచన మేరకు తాను రైల్వే అధికారులతో ఓదెల ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చానని చెప్పారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఓబీ నిర్మాణం వల్ల సామన్య ప్రజలకు నష్టం లేకుండా, రీహాబిటేషన్ తక్కువ ఉండేలా అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌​ఉండాలని సూచించారు.