హైదరాబాద్, వెలుగు: జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది కింద బీసీలకు హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సెన్సస్ లెక్కల్లో కులాలవారీగా బీసీలను లెక్కించకుండా ప్రధాని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోయినేడాది ఏప్రిల్ 1వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో జాతీయ జనగణనలో కులగణన చేస్తామని నిర్ణయం తీసుకున్నారని జాజుల గుర్తు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి దశ జనగణనలో భాగంగా కుటుంబాల లెక్కింపు జరిగినప్పుడు ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలన్న బీసీల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతోపాటు ఓబీసీ కుటుంబాలను లెక్కించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిలదీసినప్పుడు.. రెండో దశలో బీసీ కులగణన చేపడ్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాజాగా కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌లోని 40 ప్రశ్నల్లో ఎస్సీ, ఎస్టీల గురించే అడిగింది తప్ప, ఓబీసీ, మరే కులం గురించి అగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జాబితా ప్రకటించకుండా, ప్రతి కులానికి ఒక యూనిక్ నెంబర్‌ను కేటాయించకుండా బీసీ కులాల లెక్కలు ఏ విధంగా తీస్తుందో చెప్పాలని కేంద్రాన్ని జాజుల డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవరించి తెలంగాణ, బిహార్‌లో జరిగిన కులగణను మోడల్‌గా తీస్కోవాలని కోరారు.
