- ఎకరానికి రూ.కోటి చొప్పున సాయం
- రాష్ట్రాలకు కేంద్రం ఆఫర్
న్యూఢిల్లీ: భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకం కింద 50 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. రూ.33,660 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ గత మార్చి 18న ఆమోదం తెలిపింది. దాదాపు మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుంది.
ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం, దేశ ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను వెల్లడించారు. మొదటి రెండు నెలల్లో 20 పార్కులకు, ఆ తర్వాతి రెండు నెలల్లో మరో 30 పార్కులకు రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఈ 50 పార్కులకు అనుమతులు ఇస్తారని, మిగిలిన 50 పార్కులను తదుపరి దశలో చేపడతారని వివరించారు. రాష్ట్రాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
గరిష్టంగా వెయ్యి ఎకరాల్లో
ఈ పథకం కింద 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎకరానికి రూ.కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. కొండ ప్రాంత రాష్ట్రాల్లో 25 ఎకరాల్లో కూడా పార్కు ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. భూమి, నీరు, విద్యుత్ వంటి మెరుగైన వసతులు కల్పించే రాష్ట్రాలు పెట్టుబడిదారులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంది. రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి.
దరఖాస్తులకు వేగంగా అనుమతులు లభించాలంటే రాష్ట్రాలు ప్రత్యేక ప్రయోజన సంస్థలను (ఎస్పీవీలు) ఏర్పాటు చేయాలి. ప్లానింగ్ అథారిటీని నోటిఫై చేయడంతో పాటు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకురావాలి. ఈ పార్కులు లక్షలాది మందికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రపంచ పెట్టుబడిదారులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
