తెలంగాణకు ‘ఐఐఎం’ ఇవ్వం... సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రం నో

తెలంగాణకు ‘ఐఐఎం’ ఇవ్వం... సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రం నో
  •     ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనేదీ లేదని వెల్లడి 
  •     ముఖ్యమంత్రికి కేంద్ర విద్యాశాఖ మంత్రి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్(ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఐఐఎం మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఢిల్లీలో కలిసి అందజేసిన వినతులు, ఇటీల రాసిన లేఖకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిచ్చారు. 

ప్రస్తుతానికి తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వంటి కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటై విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఉన్నందున, కొత్తగా ఐఐఎం ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. అలాగే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ గురించి లేఖలో ప్రత్యేకంగా ప్రస్థావించారు. ములుగులో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం పార్లమెంటు ఇటీవలే సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్-2009ను సవరించిందని తెలిపారు.