సెంట్రింగ్ కార్మికుల సమస్యలు తీర్చాలి..రెండు రోజుల్లో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ ..లేదంటే ధర్నాకు కూర్చుంటా: కల్వకుంట్ల కవిత

సెంట్రింగ్ కార్మికుల  సమస్యలు తీర్చాలి..రెండు రోజుల్లో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ ..లేదంటే ధర్నాకు కూర్చుంటా: కల్వకుంట్ల కవిత
  • ఇందిరాపార్క్​లో సెంట్రింగ్ కార్మికుల మహాధర్నాకు 
  • ఆమెతోపాటు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల మద్దతు

హైదరాబాద్, ముషీరాబాద్, వెలుగు: ప్రాణాలు పణంగా పెట్టి అద్దాల మేడలు నిర్మిస్తున్న సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలవాలని, రెండు రోజుల్లో వారి సమస్యలు పరిష్కరించకుంటే తానే స్వయంగా వారితో కలిసి ధర్నాకు కూర్చుంటానని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. 

గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న రెండు రోజుల నిరసన దీక్షకు శనివారం ఆమెతోపాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమవుతున్నాయని విమర్శించారు. 

కూల్చివేతల వల్ల నష్టపోతున్న సెంట్రింగ్ మెటీరియల్​కు ప్రభుత్వం కనీస పరిహారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కార్మికులు కోరుతున్న ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్​కు రూ. 51 ధర, ప్రమాద బీమా రూ. 20 లక్షలకు పెంపు లాంటి న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

 అనంతరం ఎమ్మెల్యేలు, సీఐటీయూ నేతలు మాట్లాడుతూ.. 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ. 3 వేల పెన్షన్, శాశ్వత గుర్తింపు కార్డులు, బస్సు పాస్ సౌకర్యంతో పాటు 'ఫ్యూచర్ సిటీ'లో సెంట్రింగ్ సంఘానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.