నవంబర్ 1 కల్లా ‘సర్’కు రెడీగా ఉండాలి..జిల్లా కలెక్టర్లతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

నవంబర్ 1 కల్లా ‘సర్’కు రెడీగా ఉండాలి..జిల్లా కలెక్టర్లతో  సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
  • లోపాలులేని ఓటర్ల జాబితా తయారు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: స్పెషల్​ ఇన్​టెన్సివ్​ రివిజన్​(సర్) కు వచ్చే నెల 1లోగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఈఓ సుదర్శన్​ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని, పెండింగ్‌  పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్‌ స్టేషన్‌ వారీగా పురోగతిని సమీక్షిస్తూ కచ్చితమైన, లోపరహిత ఓటర్ల జాబితా తయారీ పై దృష్టి పెట్టాలని సూచించారు. 

ఇప్పటికే బిహార్​లో సర్  పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమైంది.  గత నెల 15న, ఈ నెల 22, 23న రాష్ట్రాల సీఈవోలతో ఈసీ సర్​ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్ పై శనివారం జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ ఈఆర్ఓలతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలతో మళ్లీ వచ్చే నెల 1వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్‌, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరి సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.