రాజన్నసిరిసిల్ల, వెలుగు: సెస్ పాలక మండలిని కొనసాగించడం ఇష్టం లేకపోతే తాము రాజీనామా చేస్తామని, తమ రాజకీయ కక్ష సాధింపు కోసం సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేయొద్దని చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ నెల 1న జీవో 5, 6 ద్వారా సెస్‌ను ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకున్నదని అధికారులు చెబుతున్నారన్నారు. సెస్‌లో 3.51 లక్షల విద్యుత్ కనెక్షన్లు, 3.10 లక్షల వినియోగదారులు ఉన్నారని, ఇంత పెద్ద వ్యవస్థను స్వాధీనం చేసుకునేటప్పుడు కనీసం సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.
రాజకీయ దురుద్దేశంతోనే తమ పాలక మండలిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సెస్‌ను కాపాడుకోవడానికి వినియోగదారులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేయాలని చూస్తోందన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, రవీందర్‌రెడ్డి, కృష్ణహరి పాల్గొన్నారు.

