- ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించాలి
- సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి లెటర్
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టులను చేపట్టిందని గుర్తు చేశారు.
అప్పడు ఎమ్మెల్యేగా తాను చొరవ తీసుకుని దివంగత సీఎం వైఎస్‌ఆర్‌తో శంకుస్థాపన చేయించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అరకొర నిధులు కేటాయించడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రివ్యూ చేయడం శుభపరిణామమని, కానీ గండిపల్లి రిజర్వాయర్ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
గండిపల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 40 శాతం పనులే పూర్తికాగా, మొత్తం 660 ఎకరాలకుగాను, ఇంకా 300 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కన్నపేట మండలంలోని 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. గండిపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి వెంటనే రూ. 100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నిధుల కొరత లేకుండా చూడడంతో పాటు పనులు స్పీడ్‌గా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
