మావోయిజం అంతం అసాధ్యం : చాడ వెంకట్‌రెడ్డి

మావోయిజం అంతం అసాధ్యం : చాడ వెంకట్‌రెడ్డి
  • ఆకలి కేకలు ఉన్నన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటయ్‌
  • సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి

కరీంనగర్‌ సిటీ, వెలుగు : దేశంలో మావోయిజాన్ని అంతం చేయడం అసాధ్యమని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆకలి కేకలు ఉన్నన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పరిపాలన కొనసాగిస్తోందని ఆరోపించారు.

మావోయిస్టుల ఏరివేతపై డెడ్‌లైన్‌ పెట్టి, పోలీసులను ఉసిగొల్పడం అప్రజాస్వామికం అన్నారు. నియంతృత్వ పాలనతో దేశంలో అలజడి రేపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అమాయకులు బలవుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తీసుకుంటున్న నిర్ణయం తాత్కాలిక విరామమే తప్ప.. ఉద్యమం అంతం కాదని తేల్చి చెప్పారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మావోయిస్టుల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గసభ్యులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పైడిపల్లి రాజు పాల్గొన్నారు.