గోదావరిఖని, వెలుగు: నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి ఓ వ్యక్తి చైన్ తెంపుకెళ్లాడు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన వొడ్నాల భూలక్ష్మి ఆదివారం పక్కింట్లో మామిడి కాయ రాలితే తెచ్చుకునేందుకు బజారుకు వచ్చింది. ఇదే టైంలో నంబర్ ప్లేట్ లేని టూవీలర్‌పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఆ చైన్ రెండు తులాలు ఉన్నట్లు బాధితురాలు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలించి అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇటీవల బంగారం ధరలు పెరగడంతో చైన్‌స్నాచింగ్, ఇళ్లలో చోరీలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
