
ఖైరతాబాద్, వెలుగు: పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల18, 19 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టం చేయాల్సిన ప్రధాని మోదీ.. మంద కృష్ణతో కలిసి పోరాటం చేస్తామని చెప్పడం ఓట్ల రాజకీయంలో భాగమేనని విమర్శించారు.
మంద కృష్ణ మాదిగను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను చేరదీయాలన్నారు. కేసీఆర్ మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా వారిని విస్మరించారని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ ముక్కలవుతుందని చెప్పారు. సమావేశంలో వక్కల గడ్డ సోమ చంద్రశేఖర్, గజ్జెల మల్లికార్జున్, జోగారావు, మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.