వచ్చే నెల 9న షర్మిల పార్టీ?

వచ్చే నెల 9న షర్మిల పార్టీ?

ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించే చాన్స్
షర్మిలకు నిజామాబాద్ అభిమానుల చీర, సారె
ఇయ్యాల పాలమూరు అభిమానులతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కొన్ని రోజులుగా మద్దతుదారులతో చర్చలు జరుపుతున్న వైఎస్ షర్మిల వచ్చే నెల 9న పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి అదే సభలో పార్టీ పేరును ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మే14వ తేదీననే పార్టీని ప్రకటించాలని అనుకున్నా, అప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయని.. పైగా లేట్ చేసేకొద్దీ పార్టీకి నష్టమన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

జిల్లాల వారీగా మీటింగ్‌‌లు

హైదరాబాద్ లోటస్ పాండ్ లో షర్మిలను సోమవారం నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన మద్దతుదారులు కలిశారు. ఆమెకు తెలంగాణ సింధూరం అంటూ చీర, సారెను అందించారు. తమ జిల్లాకు రావాలని ఇన్వైట్ చేశారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లా మద్దతుదారులతో షర్మిల సమావేశం కానున్నారు. మీటింగ్ కు 800 మందిని పిలిచినట్లు తెలిసింది. త్వరలో ఆదిలాబాద్ లేదా నిజామాబాద్ జిల్లా అభిమానుల‌‌‌‌తో ష‌‌‌‌ర్మిల ఆత్మీయ స‌‌‌‌మ్మేళ‌‌‌‌నాలు నిర్వహించే అవ‌‌‌‌కాశాలు క‌‌‌‌నిపిస్తున్నాయి. సోమవారం ఈ అంశంపై రెండు జిల్లాల ముఖ్యనేత‌‌‌‌లతో ష‌‌‌‌ర్మిల స‌‌‌‌మీక్ష జ‌‌‌‌రిపారు. కాగా, సోమవారం యాంకర్ శ్యామలతో పాటు పలువురు సినీ ఆర్టిస్టులు కూడా షర్మిలను కలిశారు.

రేవంత్ ఫై తూడి దేవేందర్ రెడ్డి ఫైర్

షర్మిల రాజకీయ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆమె అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. షర్మిల పార్టీ పెట్టడం ఆయనకు కంటగింపుగా మారిందన్నారు. వైఎస్సార్ అభిమానుల మద్దతుతో పీసీసీ చీఫ్​కావాలని రేవంత్ చూస్తున్నారని, టీకాంగ్రెస్ వైఎస్ పేరు ఎత్తకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.