సాయుధ పోరాటంలో గద్దర్ ది కీలక పాత్ర..చంద్రబాబు వ్యాఖ్యలతో అవాక్కైన తెలంగాణ సమాజం

సాయుధ పోరాటంలో గద్దర్ ది కీలక పాత్ర..చంద్రబాబు వ్యాఖ్యలతో అవాక్కైన తెలంగాణ సమాజం
  •  ఎన్నో ప్రజాపోరాటాలకు నాంది పలికారు
  • మా ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని వ్యాఖ్య
  • పేదల హక్కుల పరిరక్షణే ధ్యేయం
  • కాల్పులపై తప్పుడు ప్రచారం చేశారని కామెంట్
  • గద్దర్ కుటుంబీకులకు పరామర్శించి బాబు

అల్వాల్: తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కీలక పాత్ర పోషించారని, అలా ఎన్నో ప్రజా పోరాటలకు నాంది పలికారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదల హక్కుల పరిక్షణే తమ ఇద్దరి లక్ష్యమని చెప్పారు. అవగాహనా రాహిత్యంతో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946 నుంచి 1948 వరకు జరిగిందే తెలంగాణ సాయుధ పోరాటం. ఈ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ 1949 లో మెదక్ జిల్లా తూఫ్రాన్ లో జన్మించారు. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం పూర్తయింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేశారు. తాను పుట్టకముందే జరిగిన సాయుధ పోరాటంలో గద్దర్ ఎలా పాల్గొంటారు..? అన్నది చర్చనీయాంశమైంది. 

మా భూమి సినిమా చూసి.. 

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని‘మా భూమి’పేరుతో సినిమా తీశారు నిర్మాత నర్సింగరావు. ఆ సినిమాలో ఉద్యమకారుడి పాత్రలో గద్దర్ నటించారు. చిత్రంలోని‘బండెనకబండి కట్టి పదహారెడ్ల బండి కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడకా నైజాము సర్కరోడా’అనే పాట పాపులర్ అయ్యంది. ఆ సినిమా పాటను చూసే గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు భావించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దాదాపు పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు తెలంగాణ సాయుధ పోరాటంపై అవగాహన లేకపోవడం గమనార్హం. 

కాల్పులపై తప్పుడు ప్రచారం

1997లో గద్దర్ పై కాల్పులు జరిగాయని, ఆ ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్ తనతో అనేక సార్లు మాట్లాడారని అన్నారు. తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటేనని పేదల హక్కుల పరిక్షణ కోసమే ఇద్దరం పోరాడామన్నారు. గద్దర్ అంటే భయం తెలియని వ్యక్తి అని చెప్పారు. గద్దర్ భావి తరాలకు ఆదర్శవంతుడని పేర్కొన్నారు. 

హైదరాబాద్ అభివృద్ధిపై..

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసునని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని చెప్పారు.