ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్​ చాలట్లే..

ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్​ చాలట్లే..

హైదరాబాద్​లో ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ – గరుడ బస్సులకు ఛార్జింగ్​ చాలట్లేదు. కారణం ట్రాఫిక్ జామ్. మీరు విన్నది నిజమే. ట్రాఫిక్​ కారణంతో 150 కి.మీ.లు నడిచే బస్సు.. సామర్థ్యం మేర రీచ్​ కాలేకపోతోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల బ్యాటరీలోని ఛార్జింగ్‌ను ట్రాఫిక్‌ జామ్‌లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన ఛార్జింగ్‌ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని ఛార్జ్​ చేయాల్సి వస్తోంది. ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. 

ఆర్టీసీ పది ఎలక్ర్టిక్​ బస్సులను విజయవాడకు తిప్పుతోంది. వీటిని బీహెచ్​ఈఎల్​లో డిపో ద్వారా నిర్వహిస్తుండగా.. మియాపూర్​ డిపోలో ఛార్జింగ్​ పెడుతున్నారు. అక్కడి నుంచి ఎంజీబీఎస్​కు చివరికి విజయవాడ కు చేరుకుంటుంది. మియాపూర్​ ఎంజీబీఎస్​ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్​ఉంటోంది. దీంతో బస్సుకు తరచూ బ్రేకులు వేయాల్సి వస్తోంది. దీంతో పవర్​ చాలా ఖర్చవుతోంది. ఎంజీబీఎస్​ నుంచి చౌటుప్పల్​ వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. మొత్తంగా 150 కి.మీ.లు నడవాల్సిన బస్సు పవర్​ సిటీలోనే ఖర్చవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తర్వాత సూర్యాపేటలో ఛార్జ్​ చేస్తున్నారు. ఇందు కోసం బస్సుని బ్రేక్​ టైం అని ఆపడంతో ప్రయాణికులు అసహనానికి లోనవుతున్నారు. చప్పుడు లేకపోవడం, ఏసీ బస్సులు కావడం వల్ల ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించడానికి ఇంట్రస్ట్​ చూపుతున్నారు. విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో డిమాండ్​ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో ఛార్జింగ్​ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నయ మార్గాలు చూడాలని పబ్లిక్​ కోరుతున్నారు.