చెక్‌‌బౌన్స్‌‌ ఇక చిన్న నేరమేనా!

చెక్‌‌బౌన్స్‌‌ ఇక చిన్న నేరమేనా!

వ్యాపారాలలో చిన్న నేరాలకు తక్కువ శిక్షలపై పరిశీలన
ఈజ్ ఆఫ్‌‌ డూయింగ్‌‌ను మెరుగుపరిచేందుకే
మొత్తం 19 చట్టాల డీక్రిమినలైజేషన్‌‌

న్యూఢిల్లీ: ప్రస్తుత అసాధారణ పరిస్థితులలో దేశంలో వ్యాపారాలు సజావుగా సాగేందుకు చిన్న చిన్న నేరాలకు శిక్ష తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో చెక్‌‌ బౌన్స్‌‌, లోన్‌‌లను తిరిగి చెల్లించడం వంటి వాటికి సంబంధించిన నేరాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 19 చట్టాలను డీక్రిమినిలైజ్‌‌ చేయాలని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ  భావిస్తోంది. దీంతో దేశంలో వ్యాపారాలు చేసుకోవడం మరింత సులభంగా మారుతుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఈ నెల 23 లోపు చెప్పాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సివిల్‌‌ సొసైటీలు, ప్రైవేట్‌‌, పబ్లిక్‌‌ సెక్టార్‌‌ కంపెనీలు, మేధావులు, ప్రజలను కోరింది. వీరి ఫీడ్‌‌ బ్యాక్‌‌ల ఆధారంగా ఏదైనా సెక్షన్‌‌ను డీక్రిమినలైజ్‌‌ చేయాలా లేదా అలానే ఉంచాలనే దానిపై డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ తుది నిర్ణయం తీసుకుంటుంది.

శిక్షలు తగ్గుతాయ్‌‌..

చట్టాలను డీక్రిమినలైజ్‌‌ చేయడం వలన చాలా నేరాలకు విధించే శిక్షల తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం నెగోషియబుల్‌‌ యాక్ట్‌‌లోని 138 సెక్షన్‌‌ కింద చెక్‌‌ బౌన్స్‌‌ అయితే ఆ చెక్‌‌ ఇచ్చిన వ్యక్తి నేరం చేసినట్టే.  ఈ చట్టంలోని ఇతర ప్రొవిజన్లను పట్టించుకోకుండా ఈయన్ని రెండేళ్ల వరకు జైల్లో పెట్టొచ్చు లేదా చెక్‌‌లోని అమౌంట్‌‌కి రెండింతల వరకు ఫైన్‌‌ను కట్టించుకోవచ్చు. లేదా ఈ రెండింటిని విధించవచ్చు. అదే ఎల్‌‌ఐసీ యాక్ట్‌‌, 1956 లోని సెక్షన్‌‌ 13 ని ఉల్లంఘించిన వారు ఈ యాక్ట్‌‌లోని సెక్షన్‌‌ 40 కింద ఒక ఏడాది పాటు జైలుకి లేదా రూ. 1,000 లు ఫైన్‌‌ కట్టాలి. లేదా ఈ రెండింటిని విధిస్తారు. డీక్రిమినలైజ్‌‌ చేస్తే ఈ శిక్షల తీవ్రత
తగ్గుతుంది.

మరింత సులువుగా దేశంలో వ్యాపారాలు..

చిన్న నేరాలను డీక్రిమినలైజ్‌‌ చేయడం వలన భవిష్యత్‌‌లో ‘ఈజ్‌‌ ఆఫ్ డూయింగ్‌‌ బిజినెస్‌‌’ మెరుగుపడుతుందని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ పేర్కొంది. అంతేకాకుండా  న్యాయ వ్యవస్థ, జైళ్లలో పేరుకుపోయిన కేసులు తగ్గడానికి కూడా ఇది సాయపడుతుందని తెలిపింది.  ప్రభుత్వ ఆశయాలైన ‘సబ్‌‌కా సాత్‌‌, సబ్‌‌కా వికాస్‌‌, సబ్‌‌కా విశ్వాస్‌‌’ లను చేరుకోవడానికి ఇదొక ముందడుగని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో తెలిపింది.

20 లక్షల కోట్ల ప్యాకేజిలో భాగంగా చిన్న నేరాలను డీక్రిమినలైజ్‌‌ చేస్తామని ఆర్థిక మంత్రి గత నెలలో ప్రకటించారు.   కంపెనీస్‌‌ యాక్ట్‌‌, ఇతర యాక్ట్‌‌లకు  సంబంధించి చిన్న నేరాలను డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ లిస్ట్‌‌ చేసిందని, ఈ నేరాలను డీక్రిమినలైజ్‌‌ చేయడం ప్రభుత్వ దృష్టిలో ఉందని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లకు ఈ ప్రతిపాదన నచ్చుతుందని నిష్హిత్‌‌ దేశయ్‌‌ అసోసియేట్స్‌‌ ఫౌండర్‌‌‌‌ ప్రతిభా జైన్‌‌ అన్నారు. ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ, ఈడీ, సీబీఐ న్యాయ పరిధిలో గందరగోళం నెలకొని ఉందని చెప్పారు. వీటిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని సార్లు ఒకే నేరానికి వీరందరూ ప్రొసీడింగ్స్‌‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

డీక్రిమినైలైజ్‌‌ చేయనున్న చట్టాలు..

మొత్తం 19 చట్టాలను డీక్రిమినలైజ్‌‌ చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇందులో  నెగోషియబుల్ ఇన్‌‌స్ట్రుమెంట్స్‌‌ యాక్ట్‌‌ (చెక్‌‌ బౌన్స్‌‌), సర్ఫేసి యాక్ట్‌‌ (బ్యాంక్‌‌ అప్పులను తిరిగి చెల్లించడం), ఎల్‌‌ఐసీ యాక్ట్‌‌, పీఎఫ్‌‌ఆర్‌‌‌‌డీఏ యాక్ట్‌‌ , ఆర్‌‌‌‌బీఐ యాక్ట్‌‌, ఎన్‌‌హెచ్‌‌బీ యాక్ట్​, బ్యాంకింగ్‌‌ రెగ్యులేషన్‌‌ యాక్ట్‌‌, చిట్‌‌ ఫండ్స్‌‌ యాక్ట్‌‌, ఇన్సూరెన్స్‌‌ యాక్ట్‌‌, పేమెంట్‌‌ అండ్‌‌ సెటిల్‌‌మెంట్స్ సిస్టమ్‌‌ యాక్ట్‌‌, నాబార్డ్ యాక్ట్‌‌, స్టేట్‌‌ ఫైనాన్షియల్‌‌ కార్పొరేషన్స్‌‌ యాక్ట్‌‌లు ఉన్నాయి. వీటితో పాటు  క్రెడిట్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ కంపెనీస్‌‌ (రెగ్యులేషన్‌‌) యాక్ట్‌‌, ఫ్యాక్టరింగ్‌‌ రెగ్యులేషన్‌‌ యాక్ట్‌‌, గణాంకాల చట్టం, జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌ బిజినెస్‌‌(నేషనలైజేషన్‌‌) యాక్ట్‌‌, అన్‌‌రెగ్యులేటెడ్‌‌ డిపాజిట్‌‌ స్కీమ్స్‌‌ బ్యానింగ్‌‌ యాక్ట్‌‌, డీఐసీజీసీ యాక్ట్‌‌,  మనీ సర్క్యులేషన్‌‌ స్కీమ్స్‌‌(బ్యానింగ్‌‌) యాక్ట్ వంటివి కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!