చెన్నై హోటళ్లకు గ్యాస్ గండం.. ప్రధాని మోడీకి అసోసియేషన్ లేఖ

చెన్నై హోటళ్లకు గ్యాస్ గండం.. ప్రధాని మోడీకి అసోసియేషన్ లేఖ

ఇరాన్ వార్ కారణంగా ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతులు నిలిచిపోవటంతో భారతదేశంలో దాని ప్రభావం కనిపించటం స్టార్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపధికన గ్యాస్ గృహ వినియోగదారులకు, హాస్పిటల్స్, హెల్త్ కేర్ వంటి కీలక రంగాలకు సర్దుబాటు చేస్తుండగా.. దేశంలోని మెట్రో నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. బెంగళూరు, ముంబై తర్వాత చెన్నై నగరంలోని హోటల్స్ కూడా గ్యాస్ షార్టేజీతో వ్యాపారాలను మూసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై హోటల్స్ అసోసియేషన్ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. 

చెన్నై నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడు గ్యాస్ గండంలో చిక్కుకున్నాయి. వాణిజ్యపరమైన ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగవచ్చనే వార్తలతో.. నగరంలోని వేలాది భోజనశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. మార్చి 10 నుండి సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య చెన్నై హోటల్స్ అసోసియేషన్ తమ ఆందోళనను అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. 

చెన్నై నగరవ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా హోటళ్లు, చిన్న టీ కొట్టుల నుండి మధ్యతరహా రెస్టారెంట్ల వరకు పూర్తిగా వాణిజ్య సిలిండర్లపైనే ఆధారపడి ఉన్నాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సాధారణ రెస్టారెంట్‌కు రోజుకు 5 నుండి 10 సిలిండర్లు అవసరమవుతాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు లేవని.. కిచెన్స్ మూసివేయడం తప్ప మరో దారి లేదని స్పష్టం చేశారు. కేవలం కొద్దిమంది మాత్రమే విద్యుత్ ఆధారిత కిచెన్స్ కలిగి ఉన్నారని.. మెజారిటీ హోటళ్లకు అది సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని కోరుతూ అసోసియేషన్ ప్రధాని మోడీకి లేఖ రాసింది. రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరాను 'అత్యవసర సేవ'గా గుర్తించాలని కోరింది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టల్ విద్యార్థులు, ప్రయాణికులకు ఆహారం అందించే ఈ రంగం దెబ్బతింటే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని లేఖలో వివరించింది అసోసియేషన్. ఇదే తరహా ఆందోళనలు కర్ణాటకలోని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. ముంబైలో కూడా 20 శాతం హోటళ్లు మూతపడగా.. మరో రెండు రోజుల్లో 50 శాతం కిచెన్స్ క్లోజ్ అవుతాయని వెల్లడైంది.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చమురు రవాణా మార్గాల్లో ఏర్పడిన అంతరాయం, అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీసింది. దీనివల్ల దేశీయంగా వాణిజ్య సిలిండర్ ధర రూ.115 వరకు పెరిగింది. ఈ కొరతను అధిగమించేందుకు కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. రిఫైనరీలలో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని.. అక్రమ నిల్వలను అరికట్టేందుకు బుకింగ్‌ల మధ్య 25 రోజుల గడువును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, హోటళ్లు.. ఇతర పరిశ్రమల విన్నపాలను పరిశీలించేందుకు ముగ్గురు కార్యనిర్వాహక డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.